కమల్ హాసన్, శంకర్ కలిసి చేస్తున్న చిత్రం ‘ఇండియన్ 2’. 23 ఏళ్ల క్రితం వచ్చి సంచలనం క్రియేట్ చేసిన ‘భారతీయుడు’ చిత్రానికిది సీక్వెల్. మొదటి నుండి ఈ సినిమాను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మొదట బడ్జెట్ సమస్యలతో ప్రాజెక్ట్ దాదాపు ఆగిపోయినంత పనైంది. నిర్మాణ సంస్ధ లైకా ప్రొడక్షన్స్ సినిమా మీద శంకర్ అడిగినంత ఖర్చు చేయలేమని తేల్చి చెప్పింది. కొన్ని నెలలు ఈ వివాదం నడవగా ఎలాగో శంకర్ కాంప్రమైజ్ అయి సినిమాను రీస్టార్ట్ చేశారు. కానీ అంతలోనే క్రేన్ ప్రమాదం జరిగింది.
ఇక లాక్ డౌన్ సమస్యలు ఎలాగూ వెంటాడుతూనే వచ్చాయి. కమల్ కూడ ‘విక్రమ్’ సినిమాతో బిజీ అయిపోయారు. ఇప్పటికీ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేకున్నారు దర్శక నిర్మాతలు. దీంతో సినిమాకు డీవోపీగా చేస్తున్న రత్నవేలు కూడ సినిమా నుండి తప్పుకున్నారట. మొదటి ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ బాధ్యతలను రవివర్మన్ చేతిలో పెట్టారు. కానీ సినిమా ఆలస్యమవుతుందని గ్రహించిన ఆయన మణిరత్నం నుండి ఆఫర్ రావడంతో ‘పొన్నియన్ సెల్వన్’కు వెళ్లిపోయారు. ఆయన స్థానే రత్నవేలు డీవోపీగా వచ్చారు.
కానీ ఆగిపోయిన ఈ సినిమా ఎప్పుడు రీస్టార్ట్ అవుతుందో తెలియట్లేదు. ఇప్పటికే చాలా సమయం ఎదురుచూసిన ఆయన వస్తున్న మంచి ఆఫర్లను వదులుకోవడం ఇష్టం లేక ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారట. ప్రస్తుతం ఆయన సూర్య హీరోగా రూపొందుతున్న సినిమాకు డీవోపీగా సైన్ చేశారు.
