
నిఖిల్, స్వాతి హీరో హీరోయిన్లుగా కొత్త దర్శకుడు చందూ మొండేటి రూపొందించిన కార్తికేయ సినిమా ఏ స్థాయి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2014లో విడుదలైన ఈ సినిమా తర్వాత నిఖిల్, తెలుగు సినిమాకు ఓ కొత్త స్టార్ హీరోగా అవతరించారు. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు కురిపించిన చిన్న సినిమాగా పేరు తెచ్చుకున్న ‘కార్తికేయ’కు సీక్వెల్ రెడీ అవుతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. చందూ మొండేటి దర్శకత్వంలో మళ్ళీ నటించడం, కార్తికేయ సీక్వెల్ ఆలోచన గురించి నిఖిల్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
‘కార్తికేయ’కు సీక్వెల్ తప్పకుండా ఉంటుందని, దర్శకుడు చందూ మొండేటితో ఇప్పటికే దీనిపై చర్చ జరిగిందని, ప్రస్తుతం తాను లైన్లో పెట్టిన సినిమాలు పూర్తి కాగానే, కార్తికేయ సీక్వెల్ సెట్స్‌పైకి వెళుతుందని నిఖిల్ తెలిపారు. ప్రస్తుతం నిఖిల్, ‘శంకరాభరణం’ సినిమా కోసం భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ వారమే విడుదల కానున్న ఈ సినిమా తర్వాత వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా, కార్తిక్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఇక దర్శకుడు చందూ మొండేటి నాగ చైతన్యతో ‘ప్రేమమ్’ రీమేక్ మజ్నూకు దర్శకత్వం వహిస్తోన్న విషయం తెలిసిందే.