ఇంటర్వ్యూ : అజయ్ – ‘దిక్కులు… ‘లో హీరో అనగానే కొంచం భయపడ్డాను.

Ajay
ఓ 20 ఏళ్ళ కుర్రాడికి తండ్రి పాత్రలో, అజయ్ హీరోగా నటించిన సినిమా ‘దిక్కులు చూడకు రామయ్య’. అనేక సినిమాలలో నెగిటివ్ పాత్రలలో నటించించి ప్రేక్షకులలో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న అజయ్ కొంచం గ్యాప్ తర్వాత హీరోగా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సాయి కొర్రపాటి నిర్మాణంలో రాజమౌళి శిష్యుడు త్రికోటి దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 10న విడుదలవుతుంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను తెలియజేయడానికి అజయ్ మీడియాతో సమావేశం అయ్యారు. ఆయన చెప్పిన విశేషాలు మీకోసం…

ప్రశ్న) దర్శకుడు త్రికోటి… రాజమౌళి శిష్యుడు కావడంతో ఈ సినిమా అంగీకరించారా..?

స) అవును, ‘విక్రమార్కుడు’ సినిమా సమయం నుండి త్రికోటి గారు బాగా తెలుసు. రాజమౌళి గారి సినిమా కథా చర్చలలో పాల్గొనేవారు. చాలా టాలెంటెడ్ పర్సన్. ఆయన కథలను బాగా జడ్జ్ చేస్తారు. నా దగ్గర ఓ కథ ఉంది, నటించాలి అని చెప్పగానే ఓకే అనేశాను. ఆయన సినిమాలో మంచి క్యారెక్టర్ ఇస్తారు అనే నమ్మకం ఉండేది.

ప్రశ్న) మీరే హీరో అని చెప్పిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు…?

స) తండ్రి పాత్ర పోషిస్తున్న వ్యక్తి టైటిల్ పాత్రధారి కావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. గొప్ప విషయం అది. సినిమాలో ఒక 20 ఏళ్ళ కుర్రాడికి తండ్రిగా నటించడం, నాదే టైటిల్ రోల్ కావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సినిమా విడుదల కోసం చాలా ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నాను.

ప్రశ్న) త్రికోటి గారు మొదట కథ వినిపించినప్పుడు, మీరు 20 ఏళ్ళ కుర్రాడికి తండ్రిగా నటించాలి అనగానే మీ ఫీలింగ్ ఏంటి..?

స)పాటలు, ఫైటులతో కూడిన రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు నాకు సెట్ అవ్వవని నా ఫీలింగ్. నన్ను ఆ తరహా పాత్రలలో చూస్తారో..? లేదో..? అనే సందేహం నాలో ఉంది. అలాంటి సమయంలో దర్శకుడు త్రికోటి గారు ‘దిక్కులు చూడకు రామయ్య’ కథ వినిపించగానే, వెంటనే ఓకే చేశాను. ఇలాంటి కథ కోసమే నేను చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్నాను. సినిమాలో తండ్రి కొడుకులు ఒకే అమ్మాయి వెంట పడడం, నేను చేసిన ఫాదర్ క్యారేక్టరైజేషన్ వంటి అంశాలు నాకు బాగా నచ్చాయి.

ప్రశ్న) తండ్రి కొడుకులు ఒకే అమ్మాయిని ప్రేమించడం వంటి సంఘటనలు నిజ జీవితంలో జరుగుతాయా..?

స) లేదండి. తండ్రి కొడుకులు ఒకే అమ్మాయి వెంట పడడం, ప్రేమించడం వంటి సంఘటనలు జరిగే అవకాశమే లేదు. ఎక్కడైనా జరిగాయేమో నాకు తెలియదు. కాని, 40 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క మగాడిలో చిన్న ఫీలింగ్ ఉంటుంది. అమ్మాయిలు తమను చూడాలని కోరుకుంటారు. వారు రాగానే కొంచం తమలో తాము కంగారు పడడం, వాళ్ళతో క్యూట్ గా మాట్లాడడం వంటివి జరుగుతుంటాయి. అవే ఈ సినిమాలో చూపించాం.

ప్రశ్న) మరి, ప్రేక్షకులు ఇలాంటి కాన్సెప్ట్ అంగీకరిస్తారా..?

స) సినిమాలో ది బెస్ట్ పార్ట్ ఏంటంటే… తండ్రి కొడుకులు ఒకే అమ్మాయికి లైన్ వేసినా, ఎక్కడా వల్గారిటీ ఉండదు. త్రికోటి గారు ప్రతి సన్నివేశాన్ని చాలా వినోదాత్మకంగా కుటుంబ నేపధ్యంలో తెరకెక్కించారు. ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే సినిమా ఇది.

ప్రశ్న) మీరు ఎక్కువగా నెగిటివ్ క్యారెక్టర్ లలో నటించారు. హీరోగా నటించడం కష్టం అనిపించిందా..?

స) హీరోగా అనగానే కొంచం భయపడ్డాను. కష్టం అనిపించలేదు. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు క్యారెక్టర్ లో తింగరితనం, అయ్యో వీడు తెలియకుండా చేస్తున్నాడే అనే ఫీలింగ్ కలగాలి. ఎక్కడా నెగిటివ్ ఫీలింగ్ రాకూడదు. ఆ ఇంపాక్ట్ ఉండకూడదు. అందుకే నా పరంగా నటనలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. సంగీత దర్శకులు కీరవాణి గారు అజయ్ బాగా చేశాడు అని అభినందించడంతో సక్సెస్ అయ్యాయనని అనుకుంటున్నాను. సినిమా విడుదల తర్వాత హీరోగా అజయ్ ఎలా నటించాడో..? ప్రేక్షకులు చెప్పాలి. బేసిక్ గా దర్శకుడు చెప్పింది చేసుకుపోవడమే నా నైజం.

ప్రశ్న) మీ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించారు. వారితో మీ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్..?

స) సుమారు 14 ఏళ్ళ తర్వాత ఇంద్రజ గారు మళ్లీ తెలుగులో నటిస్తున్నారు. ఆవిడతో కలసి నటించడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. అలాగే ముంబై హీరోయిన్ సన తెలుగు తెరకు పరిచయం అవుతుంది. ఆ అమ్మాయికి తెలుగు రాదు. అదొక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. ముఖ్యంగా మా మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి.

ప్రశ్న) సాయి కొర్రపాటి గారి ప్రొడక్షన్ లో వర్క్ చేయడం ఎలా అనిపించింది..?

స) ఆయన బ్యానర్ లో నటించడం చాలా లక్కీ. ప్రేక్షకులకు సినిమాను రీచ్ అయ్యేలా చేయడంలో సాయి గారి తర్వాత ఎవరైనా. సినిమాను గ్రాండ్ లెవెల్ లో తెరకెక్కించారు. కథను, స్క్రిప్ట్ నమ్మి సాయి కొర్రపాటి గారు ఈ సినిమాను నిర్మించారు. ఇతర నిర్మాతలకు ఈ కథ చెప్తే, సినిమాగా నిర్మించే సాహసం చెయ్యరు. చాలా ఫాషన్ కల నిర్మాత.

ప్రశ్న) సినిమాలో మేజర్ హైలైట్స్ ఏంటి..? ఫస్ట్ కాపీ చూశారా..?

స) సోమవారం రాత్రి ఫస్ట్ కాపీ చూశాం. యూనిట్ అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ముఖ్యంగా కథ, దర్శకుడు త్రికోటి సినిమాను తెరకెక్కించిన విధానం, కీరవాణి సంగీతం సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. అజయ్ తండ్రి పాత్రలో నటించాడు అనగానే ప్రేక్షకులలో కొద్దిపాటి క్యూరియాసిటీ ఉంటుంది కదా…! అందుకే, విడుదల కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను.

ప్రశ్న) భవిష్యత్ లో కూడా హీరోగా నటిస్తారా..?

స) డిఫరెంట్ కథలు, కొత్త జోనర్ సినిమాలు అయితే తప్పకుండా హీరోగా నటిస్తాను. లేదంటే ఎలాగో నా క్యారెక్టర్లు నాకు ఉన్నాయి కదా. సో, ఐ యాం హ్యాపీ. అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Exit mobile version