
ఈ ఏడాది ‘పటాస్’ సినిమా హిట్‌తో జోరుమీదున్న కళ్యాణ్ రామ్, తాజాగా ‘షేర్’ అనే సినిమాతో మన ముందుకు వచ్చేస్తున్నారు. మల్లికార్జున్ దర్శకత్వంలో రూపొందిన ఈ లవ్ కమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని అక్టోబర్ 30న పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరో కళ్యాణ్ రామ్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు…
ప్రశ్న) ‘పటాస్’తో ఈ ఏడాది మంచి హిట్ కొట్టారు. మళ్ళీ ఇదే ఏడాది షేర్‌తో వస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతోంది?
స) ఒకే ఏడాది నేను నటించిన రెండు సినిమాలు రావడం సంతోషంగా ఉందండీ. ‘పటాస్’ లాంటి మంచి విజయం సాధించిన సినిమా తర్వాత వస్తోన్న ‘షేర్’ కూడా అదే స్థాయిలో విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా. ‘పటాస్’లానే ఈ సినిమా కూడా మనదైన కమర్షియల్ ఫార్మాట్‌లో అందరికీ కనెక్ట్ అయ్యే ఎమోషన్‌తో నడుస్తుంది. లవ్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌కు ఈ సినిమాలో పెద్ద పీట వేశాం.
ప్రశ్న) ‘పటాస్’ ఎఫెక్ట్ ‘షేర్’ సినిమాపై కూడా ఉండే అవకాశం ఉంది కదా. ఆ ప్రకారంగా స్క్రిప్ట్‌లో ఏవైనా మార్పులు చేయాల్సి వచ్చిందా?
స) హిట్ తర్వాత వచ్చే సినిమా అంటే సాధారణంగానే కొన్ని అంచనాలుంటాయి. ‘షేర్’ సినిమా ‘పటాస్’ రిలీజ్ అవ్వడానికంటే ముందే సెట్స్‌పైకి వెళ్ళింది. ఇక పటాస్ ఎఫెక్ట్ పడుతుందని చెప్పి కథలో మార్పులేమీ చేయలేదు. కాకపోతే, ఎంటర్‌టైన్‌మెంట్ పోర్షన్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకొని కొత్తగా మళ్ళీ ఆ సన్నివేశాలను రాసుకొని తెరకెక్కించాం. కథ రీత్యా మాత్రం మార్పులేమీ చేయలేదు.
ప్రశ్న) ఫ్లాప్‌లో ఉన్న దర్శకుడితో మళ్ళీ సినిమా చేశారు. రిస్క్ అనిపించలేదా?
స) రిస్క్ ఏమీ లేదండీ. నాకు సక్సెస్ ట్రాక్ అనే దానికంటే దర్శకుడికి ఎంత టాలెంట్ ఉందన్నదే ముఖ్యం. కథ చెప్పేటప్పుడు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారన్న విషయమే నేను డిసిషన్ తీసుకోవడంలో ప్రధానంగా చూసే అంశం. దర్శకుడు మల్లికార్జున్ టాలెంట్ ఏంటనేది నాకు చాలాకాలంగా తెలుసు. మేమిద్దరం కలిసి చేసిన సినిమాలు ఫ్లాప్ అయితే అయి ఉండొచ్చు. ఈ సినిమా విషయంలో కాన్ఫిడెంట్ పోగొట్టుకోకుండా మళ్ళీ కష్టపడి మల్లి తన టాలెంట్‌ను నిరూపించుకునేలా పనిచేశాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ సినిమా పూర్తిగా దర్శకుడి కష్టం. మల్లికార్జున్ కోసమైనా సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా.
ప్రశ్న) ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
స) ఈ సినిమాలో నాది బాయ్ నెక్స్ట్ డోర్ టైప్ క్యారెక్టర్. పటాస్‌లోలా భారీ డైలాగులు లాంటివి ఈ సినిమాలో ఉండవు. ఓ సాధారణ సివిల్ ఇంజనీర్ తన ఫ్యామిలీ కోసం, ప్రేమ కోసం ఏమేం చేశాడు అన్న ప్రధాన అంశం చుట్టూ సినిమా తిరుగుతూంటుంది.
ప్రశ్న) మీ బ్యానర్‌లో సినిమా చేయడం, వేరొక బ్యానర్‌లో సినిమా చేయడం.. ఈ రెండింటినీ ఎలా చూస్తారు?
స) ఏ బ్యానర్‌లో చేసినా హీరో నేనే కదండీ. కళ్యాణ్ రామ్ అన్న పేరుతోనే కదా సినిమా పడేది!? నాకు నా బ్యానరా? బయటి బ్యానరా? అన్న తేడాలేమీ లేవు. బయటి బ్యానర్‌లో నటించినా హీరోగా అన్నీ చేస్తూనే, ఒక నిర్మాతగా ఆలోచించి ఏమేం చేయాలో కూడా అవి చేస్తూంటా!
ప్రశ్న) మీరు నిర్మాతగా చేసిన ‘కిక్ 2’ సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది కదా! అప్పుడెలా ఫీలయ్యారు?
స) సక్సెస్, ఫెయిల్యూర్‌లను పట్టుకొని వాటిచుట్టూనే ఆలోచించేంత పరిస్థితులను ఎప్పుడో దాటేసి వచ్చా. సినిమా ఫెయిలైతే ఎందుకు ఫెయిలైందీ? అనేది తెలుసుకొని మరోసారి అలాంటి తప్పు చేయకుండా జాగ్రత్త పడుతుంటా. హిట్ సినిమా అయినా ఫ్లాప్ సినిమా అయినా, భారీ బడ్జెట్ సినిమా అయినా లో బడ్జెట్ సినిమా అయినా.. సినిమా కోసం పడే కష్టం ఎప్పుడూ ఒక్కటే! అయితే రిజల్ట్ మాత్రం మన చేతుల్లో లేదన్నది వాస్తవం.
ప్రశ్న) ‘ఓమ్’ తర్వాత ప్రయోగాలు చేయొద్దని ఫిక్స్ అయ్యారా?
స) అలా అనేం లేదు. ప్రయోగాలకు నేనెప్పుడూ ముందుంటా. కాకపోతే ప్రేక్షకులు కథ రీత్యా ఎక్కువ ట్విస్ట్‌లు పెట్టి భారంగా నడిపించే సినిమాలు కోరుకోవడం లేదు. అందుకు తగ్గట్టుగా వాళ్ళకు నచ్చినట్టుగా కథను చెప్తూనే ప్రయోగం చేయగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం. అలా బ్యాలెన్స్ చేయగలిగే కథలు ఉంటే ప్రయోగాలకు నేను వెనుకాడను.
ప్రశ్న) తదుపరి ప్రాజెక్టులు ఏంటి? ఎన్టీఆర్‌తో మీ బ్యానర్‌లో సినిమా ఎప్పుడు ఉంటుంది?
స) నా కొత్త ప్రాజెక్టు ఏంటనేది త్వరలోనే చెప్తా. ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నా. అన్నీ ఫైనల్ కాగానే ప్రకటించేస్తా. ఎన్టీఆర్‌తో సినిమా తప్పకుండా ఉంటుంది. అది ఎప్పుడనేది మేమిద్దరం కలిసి పెద్ద ఈవెంట్ పెట్టి మరీ అనౌన్స్ చేస్తాం!