
తెలుగు, తమిళ భాషలతో పాటు సౌత్ ఇండియాలోనూ సూపర్ స్టార్డం ఉన్న హీరో ఉలగనాయగన్ కమల్ హాసన్. అలాంటి కమల్ నుంచి వస్తున్నా యాక్షన్ థ్రిల్లర్ ‘చీకటి రాజ్యం’. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రూపొందించిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 10న తమిళంలో రిలీజ్ కానుంటే 10 రోజులు ఆలస్యంగా తెలుగులో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చీకటి రాజ్యం విశేషాలు తెలుసుకోవడం కోసం కమల్ హాసన్ తో కాసేపు ముచ్చటించాం.. ఆ విశేషాలు మీకోసం..
ప్రశ్న) చాలా రోజుల తర్వాత డైరెక్ట్ గా ఓ తెలుగు సినిమా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి.?
స) ఒకటే రీజన్.. ఇక్కడి వచ్చినప్పుడల్లా అభిమానులు డైరెక్ట్ తెలుగు సినిమా ఎందుకు చేయడం లేదు అని అడిగారు.. వాళ్ళు అలా అడగడం అనేది అవార్డు రావడం కన్నా గొప్పది. అందుకే చేస్తా అని మాటిచ్చా, ఇప్పుడు చేసేసాను.
ప్రశ్న) ఇక సినిమా విషయానికి వస్తే.. ‘చీకటి రాజ్యం’ ఎలా ఉండబోతుంది.?
స) చీకటి రాజ్యం కచ్చితంగా అందరినీ థ్రిల్ చేస్తుంది, అందరికీ బాగా నచ్చుతుంది అన్న నమ్మకం ఉంది. ఎంతలా నమ్మకం ఉంది అంటే తమిళ్ వెర్షన్ ని నవంబర్ 10న రిలీజ్ చేస్తున్నాం, తెలుగు వెర్షన్ ని నవంబర్ 20న రిలీజ్ చేస్తున్నాం. అక్కడ రిలీజ్ చేసేస్తున్నాం ఇక్కడ ఎఫెక్ట్ మారుద్దేమో అనే టెన్షన్ కూడా లేకుండా ప్రోడక్ట్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నాం. అంత గ్యాప్ తీసుకొని 20న రిలీజ్ చెయ్యడానికి కారణం తెలుగులో బెటర్ రిలీజ్, బెటర్ థియేటర్స్ కోసమే..
ప్రశ్న) స్లీప్ లెస్ నైట్ అనే సినిమాని స్పూర్తిగా తీసుకొని ఈ సినిమా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి.?
స) ఒక సినిమా మనం చూసినప్పుడు ఇలాంటి సినిమా మనం కూడా చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ చాలా తక్కువ సినిమాలను చూసినప్పుడే కలుగుతుంది. అలా ఈ సినిమాని చూసినప్పుడు కలిగింది. అందుకే రైట్స్ తీసుకొని చేసాం. చెప్పాలి అంటే సాగర సంగమం అనేది కూడా జనక్ జనక్ పాయల్ బాజే సినిమా నుంచి స్ఫూర్తి తీసుకొని చేసిందే.
ప్రశ్న) స్లీప్ లెస్ నైట్ చేయడానికి అందులో మీకు నచ్చిన యునిక్ పాయింట్ ఏమిటి.?
స) ఈ సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్.. మామూలుగా థ్రిల్లర్ అంటే క్యారెక్టర్స్ లో డెప్త్ ఉండదు, సినిమా మాత్రం అటు ఇటు పరిగెడుతూ ఉన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇందులో ప్రతి పాత్రలోనూ డెప్త్ ఉంటుంది, స్ట్రాంగ్ కథ, ఫ్యామిలీ ఫీల్ ఉంటుంది, అలాగే స్పీడ్ గా సాగే స్క్రీన్ ప్లే కూడా ఉంటుంది. ఆ పాయింట్స్ వల్లే సినిమా చేసాను.
ప్రశ్న) మన నేటివిటీ కోసం కథలో చేసిన మార్పులు ఏమిటి.?
స) మన నేటివిటీ కోసం ఇంకాస్త ఎమోషనల్ డెప్త్ ని యాడ్ చేసాం. అలాగే ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ కంటే చాలా స్టైలిష్ గా ఉంటుంది మరియు ఒరిజినల్ వెర్షన్ కంటే ఎక్కువగా ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఓవరాల్ గా ఒరిజినల్ వెర్షన్ కంటే చాలా బెటర్ గా ఉంటుంది.
ప్రశ్న) మీరు నటుడు మాత్రమే కాదు డైరెక్టర్ కూడా., కానీ మీరు మీ అసిస్టెంట్ సెల్వకి డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడానికి కారణం ఏంటి.?
స) ప్రధాన కారణం.. నేను ఒక యాక్టర్ ని కాబట్టి నేనే డైరెక్టర్ గా చెయ్యాలని ఎప్పుడూ అనుకోను. అలాగే బాలచందర్ గారు కొత్త వారికి చాన్స్ ఇవ్వకపోయి ఉంటే నేను అనేవాన్ని లేను. అందుకే నేను కొత్తవారికి ఎప్పటికప్పుడు ఛాన్స్ లు ఇస్తున్నారు. అలా చేయకపోతే నేను మా గురువు గారు బాలచందర్ కి కృతజ్ఞత చూపని వాడిని అవుతా. యంగ్ జెనరేషన్ అనేది వస్తేనే ఎక్కడైనా ఫ్రెష్ నెస్ కనిపిస్తుంది అనేది నేను బాగా నమ్ముతాను.
ప్రశ్న) మీరు చేసిన చాలా సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏమంటారు.?
స) ఒక సినిమా హిట్ అవ్వడానికి అందరి కృషి ఎలా హెల్ప్ అవుతుందో.. అలాగే ఒక సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం కూడా ఒకరే కారు. ఫైనల్ ప్రోడక్ట్, అలాగే రిలీజ్ చేసిన టైం, సీజన్ ని బట్టి కూడా సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి. ఒక్కోసారి మంచి సినిమా బాడ్ సీజన్ లో రిలీజ్ అవ్వడం వలన ఫ్లాప్ అవుతుంది. అందుకే ఫ్లాప్ కి రీజన్ ఫలానా వారు అని వేలెత్తి చూపలేం.
ప్రశ్న) మీరు టెక్నికల్ గా చాలా అడ్వాన్స్ గా ఉంటారు. మరి ఆ అడ్వాన్స్ టెక్నాలజీకి సంబందించిన టెక్నీషియన్స్ మన దగ్గర ఉన్నారా.?
స) నేను ఆడ్వాన్స్ గా ఉన్నాను, కానీ ఇక్కడ అంత అడ్వాన్స్ టెక్నీషియన్స్ లేరనే చెప్పాలి. అందుకే నేను ఇతర దేశాలకు వెళ్లి కొన్ని వర్క్స్ చేయిస్తుంటాను. ఈ కారణం చేతే నేను సినిమా, టెక్నాలజీ గురించి చెప్పడం కోసం ఓ స్పెషల్ ఇన్స్టిట్యూట్ ని ప్రారంభిస్తున్నాను. అది కొత్త వారికే కాదు, నాకు నేను ఇంకా నేర్చుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. నటుడు అనేవాడు నిరంతరం కొత్తవాటి గురించి తెలుసుకుంటూ ప్రేక్షకులకు కొత్తదనాన్ని ఇస్తూ ఉండాలి.
ప్రశ్న) బాహుబలి సినిమా ద్వారా సౌత్ ఇండియన్ స్పాన్ పెరిగింది. ముందు ముందు ఈ రేంజ్ ని పెంచే అవకాశం ఉంది అంటారా.?
స) ముందు ముందు కచ్చితంగా పెరుగుతుంది..చెప్పాలంటే మన రీజనల్ బాక్స్ ఆఫీసు స్టామినా ఎంత అనేది ఎవ్వరికీ తెలియదు. నా ప్రకారం తెలుగు లేదా తమిళ చిత్ర సీమ ఎప్పుడైతే ట్రాన్స్పరెన్సీ (ఇన్నర్ గా ఒకటి బయటకి ఒకటి పెట్టుకోకుండా) గా ఉంటుందో, అలాగే బ్లాక్ మనీ అనేది బయటకి వస్తుందో అప్పుడు మన సౌత్ ఇండియన్ సినిమా రేంజ్ కూడా 1000 కోట్ల మార్కెట్ ని టచ్ చేస్తుంది. అది కూడా చిటికేసినంత సింపుల్ గా జరిగిపోతుంది. బాహుబలి సినిమాకి అలాంటి ట్రాన్స్పరెన్సీ కనిపించింది, అందుకే ఆ రేంజ్ కలెక్షన్స్ ని సాధించింది. అది త్వరలోనే అన్ని సినిమాలకు జరుగుతుందని భావిస్తున్నాను.
ప్రశ్న) మరి ఈ స్పాన్ ని మరింత పెంచడం కోసం మళ్ళీ మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మరుదనాయగం’ ని ఎప్పుడు మొదలు పెట్టనున్నారు?
స) నా ప్రకారం మంచి సినిమాలు ఎప్పుడన్నా ఆడుతాయి. బాహుబలి లాంటి సినిమా అప్పట్లో వచ్చినా బాగా ఆడేది. అలాగే మరుదనాయగం ఇప్పుడు వచ్చినా ఆడుతుంది. అప్పట్లో మరుదనాయగం ట్రైలర్ షూట్ కోసమే 8.7కోట్లు ఖర్చు పెట్టాం.. ఇప్పుడైతే ఇంకెంత ఉంటుందో ఊహించండి. ప్రస్తుతం మరుదనాయగం మీద వర్క్ అవుట్ చేస్తున్నాం. హాలీవుడ్ నెట్ ఫ్లిక్స్ వారు కూడా ఈ సినిమాని రీస్టార్ట్ చేద్దాం అని అడుగుతున్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. మరో 3-4 నెలల్లో ఆ సినిమాపై క్లారిటీ ఇస్తాం.
ప్రశ్న) బాహుబలి లాంటి భారీ బడ్జెట్ సినిమా చేయాలి అంటే మీ లాంటి స్టార్ హీరోస్ వల్లనే అవుతుంది. మరి మీ నుంచి ఎప్పుడు అలాంటి సినిమాని ఆశించవచ్చా.?
స) బాహుబలి సినిమా వచ్చేసింది కదా మళ్ళీ అలాంటి సినిమానే ఎందుకు చెప్పండి(నవ్వులు).. మామూలుగా అలాంటి సినిమాలు చేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. ప్రస్తుతం నేను ఓ మంచి కంటెంట్ ఉన్న సినిమాని వరల్డ్ స్టాండర్డ్స్ క్వాలిటీతో నాలుగు నెలల్లో ఫినిష్ చేసేసే సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను.
ప్రశ్న) ప్రస్తుతం మీరు చేస్తున్న తదుపరి సినిమా గురించి చెప్పండి.?
స) ప్రస్తుతం రాజీవ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాను. అందులో నాతో పాటు సీనియర్ యాక్టర్స్ అమల అక్కినేని, జరీన వాహీబ్ లతో పాటు ఓ కొత్త హీరోయిన్ కూడా నటిస్తోంది. ఆ సినిమా షూటింగ్ చాలా వరకూ అమెరికాలో ఉంటుంది. అది కూడా ఒకేసారి తెలుగు – తమిళ భాషల్లో షూట్ చేస్తాం..
ప్రశ్న) ఆస్కార్ అవార్డ్స్ అనగానే మన సినిమా ఒక్కటన్నా ఉందా లేదా అని వెతుక్కుంటాం.. మరి మన అవార్డ్స్ వాళ్ళతో పోటీ పడలేవు అంటారా.?
స) నా వరకూ అయితే ఎవరో పెట్టిన అవార్డు కోసం మనం వెళ్ళడం కాదండి, మన ఇండియాలో ఇచ్చే ప్రిస్టీజియస్ అవార్డు కోసం వాళ్ళు పరిగెత్తుకు రావాలి అనేది నా కోరిక. ఎందుకు అంటే మన ఇండియాలో ఏడాది 100కి పైగా సినిమాలు వస్తాయి, హాలీవుడ్ వాళ్ళు ఆ నెంబర్ ని అసలు టచ్ కూడా చెయ్యలేరు. అక్కడ వాళ్ళు సినిమాని తక్కువ చూస్తారు, కానీ మనకు సినిమా అంటే ప్రేమ. అలాంటప్పుడు మన నుంచి ఎలాంటి సినిమాలు రావాలి. కానీ రాకపోవడం బాధాకరం. ప్రస్తుతం మన ఇండియన్ సినిమా టెక్నికల్ గా, అవార్డ్స్ పరంగా హాలీవుడ్ తో పోటీ పడలేకున్నాం, కానీ అతి త్వరలోనే వాళ్ళని రీచ్ అయిపోతాం అని నమ్ముతున్నాను.
ప్రశ్న) మీకు సినిమా అంటే పాషన్.. ఇన్నేళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నా మీలో ఆ పాషన్ అనేది తగ్గలేదు. అంతలా మిమ్మల్ని మోటివేట్ చేసేది ఏంటి?
స) కొంతమందికి తినడం అంటే ఇష్టం, కొంతమందికి మ్యూజిక్ అంటే ఇష్టం,, అలా నాకు సినిమా అంటే ఇష్టం, పిచ్చి ప్రాణం.. అందుకనే నాకు సినిమానే ప్రపంచం.
అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి.. కమల్ హాసన్ కి చీకటి రాజ్యం పెద్ద హిట్ ఇవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్పాం..
రాఘవ