ఇంటర్వ్యూ : కిట్టు నల్లూరి – ‘కేటుగాడు’.. దర్శకుడిగా ఓ కాన్ఫిడెన్స్ ఇచ్చింది!

ఇంటర్వ్యూ : కిట్టు నల్లూరి – ‘కేటుగాడు’.. దర్శకుడిగా ఓ కాన్ఫిడెన్స్ ఇచ్చింది!

Published on Sep 22, 2015 7:38 PM IST

Kittu-Nalluri
‘ఉలవచారు బిర్యాని’తో సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన తేజస్ హీరోగా కిట్టు నల్లూరి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కేటుగాడు’. వెంకటేష్ మూవీస్ పతాకంపై వెంకటేష్ బాలసాని ఈ సినిమాను నిర్మించారు. చాందినీ హీరోయిన్‌గా నటించారు. ఓ కిడ్నాప్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తన మొదటి సినిమాకే ప్రేక్షకుల దగ్గర్నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చిందని తెలియజేస్తూ దర్శకుడు కిట్టు నల్లూరి చెప్పిన విశేషాలు..

ప్రశ్న) మీ మొదటి సినిమా ‘కేటుగాడు’కి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది?

స) కేటుగాడు సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. దర్శకుడిగా ఇది నా మొదటి సినిమా. ప్రేక్షకులు ఎలా రివీవ్ చేసుకుంటారో అని రిలీజ్ వరకూ కంగారుగా ఉండేది. కొత్త దర్శకుడైనా సినిమాను బాగా హ్యాండిల్ చేశాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ రెస్పాన్స్‌తో చాలా హ్యాపీగా ఉన్నా. మొదటి వారాంతం కంటే కూడా సోమవారం రోజున ఈ సినిమాకు కలెక్షన్స్ ఎక్కువగా ఉండడం ఆనందాన్నిస్తోంది.

ప్రశ్న) ఈ సినిమా ఎలా మొదలైంది? మీ నేపథ్యం ఏంటి?

స) నాది బేసిగ్గా పశ్చిమ గోదావరి జిల్లా. సినిమాలంటే ఇష్టంతో, దర్శకుడినవ్వాలని హైద్రాబాద్ వచ్చా. ఆ క్రమంలోనే ఒక ఆరేళ్ళ పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్‌ సంస్థలో పనిచేశా. ఆ తర్వాత కేటుగాడు కథతో నిర్మాత వెంకటేష్‌ గారిని కలవడం, ఆయనకు ఈ కథ నచ్చి సినిమా స్టార్ట్ అవ్వడం జరిగిపోయింది.

ప్రశ్న) ‘కేటుగాడు’తో దర్శకుడిగా ఎంత సక్సెస్ అయ్యారు అనుకుంటున్నారు?

స) చెప్పాలంటే ఏ దర్శకుడూ తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేయలేడు. అదీగాక నాకిది మొదటి సినిమా. కచ్చితంగా కొన్ని తప్పులు చేశానన్న విషయం తెలుస్తూంటుంది. నావరకు ఈ సినిమా విషయంలో దర్శకుడిగా 60% సక్సెస్ సాధించానని అనుకుంటున్నా.

ప్రశ్న) ‘కేటుగాడు’ సినిమాలో దర్శకుడిగా ఏ విషయంలో మీదైన మార్క్ చూపెట్టారని అనుకుంటున్నారు?

స) నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ అన్నీ కూడా కామెడీ విషయంలో మంచి ప్రతిభ కనబరిచాననే విషయంపైనే వచ్చాయి. కేటుగాడు సినిమాలో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తోన్న పార్ట్ కూడా ఈ కామెడీయే! ఇక నా తరువాతి సినిమాలో కూడా ఇదే పంథాలో కామెడీకి పెద్ద పీట వేస్తా.

ప్రశ్న) సినిమా రిలీజ్ అయ్యాక ఇండస్ట్రీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది?

స) ఇండస్ట్రీ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదటి సినిమా అయినా కూడా బాగా చేశానని అందరూ అంటున్నారు. కేటుగాడు సినిమాకు ప్రేక్షకుల దగ్గర్నుంచి, ఇండస్ట్రీ దగ్గర్నుంచీ వస్తోన్న రెస్పాన్స్ చూశాక నాపై నాకు ఓ మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది.

ప్రశ్న) మొదటి సినిమా ద్వారా ఏమేం నేర్చుకున్నారు?

స) చాలానే నేర్చుకున్నానండీ. మనం ఒక విషయాన్ని కథగా అనుకున్నప్పటికి, సినిమాగా అది మారే సమయానికి మధ్యన జరిగే ప్రాసెస్‌లో దర్శకుడిగా కథపై ఎంత క్లారిటీగా ఉండాలో తెలుసుకున్నా. కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో కూడా తెలిసివచ్చింది.

ప్రశ్న) తరువాతి సినిమా ఎప్పుడు?

స) ‘కేటుగాడు’ సినిమా సక్సెస్‌తో మా నిర్మాత వెంకటేష్ గారు చాలా హ్యాపీగా ఉన్నారు. వెంకటేష్ గారే నా రెండో సినిమాను కూడా నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఓ పెద్ద హీరోతో ఈ సినిమా ప్రారంభమవుతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను తెలియజేస్తా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు