
గతంలో ‘సింధూర పువ్వు’ లాంటి మంచి చిత్రాన్ని తెలుగు తెరకు అందించిన కృష్ణారెడ్డి, తన కుమారుడు నాగ అన్వేష్‌ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన సినిమాయే ‘వినవయ్యా రామయ్యా’. ‘చిరునవ్వుతో’ లాంటి సూపర్ హిట్ సినిమా దర్శకుడు జి.రామ్ ప్రసాద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపు (జూన్ 19న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో నాగ అన్వేష్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..
ప్రశ్న) హీరో అవ్వాలని ఎప్పుడు ఫిక్స్ అయ్యారు? ఈ సినిమా ఎలా మొదలైంది?
స) చిన్నప్పట్నుంచీ సినిమా వాతావరణంలోనే పెరగడంతో సినిమాలంటే మంచి ఆసక్తి ఉండేది. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా చేసి ఉండడంతో అప్పుడే హీరో అవ్వాలని ఫిక్సయ్యా. అన్నీ కుదిరి చదువు పూర్తి చేసుకోగానే నాన్నగారు మన సొంత బ్యానర్లోనే సినిమా చేద్దాం అన్నారు. డ్యాన్స్, యాక్టింగ్ లాంటి విషయాలపై చిన్నప్పట్నుంచే బాగా అవగాహన ఉండడంతో నేనూ రెడీ అయిపోయా. నా మొదటి సినిమాకు బయటినుంచి కొన్ని అవకాశాలున్నా మా బ్యానర్లోనే గ్రాండ్‌గా ఈ సినిమా తీశాం. మొత్తం 50, 60 కథలు విన్నాక ‘వినవయ్యా రామయ్యా’ కథ ఫైనల్ అయింది.
ప్రశ్న) ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతోంది?
స) ఈ సినిమాలో ఏ విషయాన్నీ సీరియస్‌గా తీసుకోని చంటి అనే ఒక యువకుడిగా కనిపిస్తా. ఎంత ఇబ్బందులు తెచ్చిపెట్టే పరిస్థితులు వచ్చినా సీరియస్‌గా తీసుకోకుండా జాలీగా తిరుగుతుంటా. అలాంటి వ్యక్తి తన జీవితంలో ఓ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సి వస్తే ఎలా ఉంటుంది అనేదే ఈ సినిమా.
ప్రశ్న) ‘వినవయ్యా రామయ్యా’ అనే టైటిల్ గురించి చెప్పండి?
స) ‘వినవయ్యా రామయ్యా’.. ఈ కథకు సరిగ్గా సరిపోయే టైటిల్ ఇది. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోని వ్యక్తికి కొంచెం వినవయ్యా అంటూ చెబుతున్నట్టు వచ్చేలా ఈ టైటిల్ పెట్టాం. హీరో కూడా ఒక దశలో శ్రీ రాముడిని నా బాధలు వినవయ్యా అని చెప్పే పరిస్థితి వస్తుంది. ఇలా అన్ని రకాలుగా ఈ సినిమాకిది కరెక్ట్ టైటిల్ అనుకోని ఈ టైటిల్‌ను ఫైనల్ చేశాం.
ప్రశ్న) దర్శకుడు రామ్ ప్రసాద్ గురించి చెప్పండి?
స) దర్శకుడిగా రామ్ ప్రసాద్ గారు ‘చిరునవ్వుతో’, ‘కళ్యాణ్ రాముడు’ లాంటి మంచి సినిమాలను అందించారు. ఈ సినిమా కూడా ఆయన స్టైల్లోనే సాగే ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. ఆయన సినిమాల్లో క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉంటూ సినిమాకు మంచి ఫీల్‌నిస్తుంది. ఈ సినిమాలోనూ అలాంటి క్లైమాక్స్‌ను చూడొచ్చు.
ప్రశ్న) ఈ సినిమాకు మేజర్ హైలైట్స్ ఏంటి?
స) ఈ సినిమాకు మేజర్ హైలైట్ అంటే.. కంటెంట్ అనే చెప్పుకోవాలి. కంటెంట్ బలమైనదైతే సినిమా కూడా బాగా వస్తుంది. ఇక ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో కామెడీ పార్ట్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. రసూల్ ఎల్లోర్ గారి సినిమాటోగ్రఫీ, అనూప్ రూబెన్స్ సంగీతం ఈ సినిమాకు హైలైట్స్.
ప్రశ్న) సినిమా చూసిన వాళ్ళ స్పందన ఎలా ఉంది?
స) ప్రివ్యూ చూసిన వాళ్ళంతా సినిమా బాగా వచ్చిందని, నేను బాగా చేశానని అంటున్నారు. వి.వి.వినాయక్ గారైతే మొదటి సినిమా అయినా బాగా చేశానని చెప్పడం సంతోషాన్నిచ్చింది. అయితే నాకు కావాల్సింది తెలిసిన వాళ్ళ రెస్పాన్స్ కాదు కదా! రేపు సినిమా విడుదలవుతోంది, ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నా. కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటాననే నమ్మకముంది.
ప్రశ్న) తరువాతి సినిమాలేంటి? భవిష్యత్‌లో ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు?
స) ఈ సినిమా రిలీజ్ అయ్యాక నా కొత్త సినిమా అనౌన్స్ చేస్తా. ఇప్పుడే ఆ సినిమా గురించి చెప్పదల్చుకోలేదు. ఓ పెద్ద దర్శకుడితోనే నా రెండో సినిమా ఉంటుంది. ఇక భవిష్యత్‌లో సరికొత్త కథలతో మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నా. హీరోగా నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కాలన్నదే నా లక్ష్యం. అందుకు తగ్గట్టుగానే సినిమాలను ఎంచుకుంటా.