‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘లక్ష్మి రావే మా ఇంటికి..’, చిత్రాల ద్వారా లవర్ బాయ్‌లా, మన పక్కింటి కుర్రాడిలా కనిపించి మంచి పేరు సంపాదించుకున్న యువహీరో నాగ శౌర్య. మొదటిసారి తన ఇమేజ్‌కు భిన్నంగా ‘చింతకాయల రవి’ ఫేం యోగేష్ దర్శకత్వంలో ‘జాదూగాడు’ సినిమాతో రానున్నాడు. ట్రైలర్, ఆడియోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ‘జాదూగాడు’ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో నాగ శౌర్యతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..
ప్రశ్న) జాదూగాడు సినిమా విశేషాలు చెప్పండి?
స) ‘జాదూగాడు’.. ఇప్పటివరకూ నేను నటించిన సినిమాలన్నింటిలోకెల్లా భిన్నమైనది. ఈ సినిమాలో మాస్, క్లాస్ అంశాలు రెండూ ఉంటాయి. జాదూగాడు అంటే కంప్లీట్ మాస్ సినిమా అనే అభిప్రాయం ఉంది. ఇది అన్ని వర్గాలకూ కనెక్ట్ అయ్యే సినిమా. ఇప్పటికే ట్రైలర్‌కు, ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా ప్రతీ ఒక్కరినీ థ్రిల్ చేస్తుందన్న నమ్మకం ఉంది.
ప్రశ్న) ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతోంది?
స) ఈ సినిమాలో నా పాత్ర పేరు కృష్ణ. ఇందులో నేనో లోన్ రికవరీ ఏజెంట్‌గా కనిపిస్తా. ఈ క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. లోన్ ఎగ్గొట్టే వ్యక్తులే జాదుగాళ్ళంటే వాళ్ళకే జాదూగాడిగా నేను కనిపిస్తానన్నమాట.
ప్రశ్న) ఫస్ట్‌టైమ్ ఓ మాస్ రోల్ చేస్తున్నట్టున్నారు. ఎలా ఉంది?
స) చాలా కొత్తగా ఉంది. ఇప్పటివరకూ కేవలం లవర్ బాయ్‌గానే కనిపించా. ఈ సినిమాలో అందుకు కాస్త భిన్నంగా మాస్ రోల్ చేశా. మాస్ రోల్ అంటే అదేదో కంప్లీట్ మాస్ లుక్ అని కాదు. లుక్ స్టైలిష్‌గా ఉంటూనే క్యారెక్టర్లో మంచి మాస్ టచ్ ఉంటుంది. ఈ సినిమా కోసం ఫైట్స్, డ్యాన్సులు కూడా చేశా. డ్యాన్సుల విషయంలో నేను చాలా వీక్. ఈ సినిమాలో మాత్రం మొదటిసారి కష్టపడి బాగానే చేశాననిపిస్తోంది.
ప్రశ్న) దర్శకుడు యోగేష్ గురించి చెప్పండి?
స) ‘చింతకాయల’ రవి తర్వాత దాదాపు ఐదేళ్ళకు ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ‘చింతకాయల రవి’ చూసిన వారికి ఆయన కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో ఆయనలోని మాస్ యాంగిల్‌ను కూడా చూస్తారు. ఆయన నాకీ సినిమా గురించి చెప్పినపుడు నేనెలా థ్రిల్ అయ్యానో, ప్రేక్షకుడు కూడా అదే థ్రిల్ ఫీలవుతాడు.
ప్రశ్న) హీరోయిన్ సోనారిక గురించి చెప్పండి?
స) సోనారిక బడోరియాకిది తెలుగులో మొదటి సినిమా. ఇందులో పార్వతి అనే క్యారెక్టర్లో ఆమె కనిపిస్తుంది. కృష్ణ క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథలో ఆమె ఎలా వచ్చిందనేది ఆసక్తికర అంశం. ఈ సినిమాలో హీరో, హీరోయిన్, విలన్.. ఇలా క్యారెక్టరైజేషన్లన్నీ కొత్తగా ఉంటాయ్!
ప్రశ్న) జాదూగాడు సినిమాకు మేజర్ హైలైట్స్ ఏంటి?
స) ఈ సినిమాకు మేజర్ హైలైట్స్ అంటే చివరి ముప్ఫై నిమిషాలని చెప్పాలి. ఈ సినిమా కథ విన్నప్పుడు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ల విషయంలో థ్రిల్ ఫీలయ్యా. ఆ పార్ట్ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలుస్తుంది. అదే విధంగా మణిశర్మ కుమారుడు సాగర్ మహతి అందించిన మ్యూజిక్, సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకు హైలైట్స్‌గా నిలుస్తాయని చెప్పొచ్చు.
ప్రశ్న) మీ తదుపరి సినిమాలేంటి?
స) ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70%పైనే పూర్తయ్యింది. నందిని రెడ్డి స్టైల్లో సాగే మంచి రొమాంటిక్ కామెడీ సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు.
