ఇంటర్వ్యూ: నేహా శెట్టి – “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” లో నా పాత్రకి శోభన గారిని రిఫరెన్స్ తీసుకున్నాం

ఇంటర్వ్యూ: నేహా శెట్టి – “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” లో నా పాత్రకి శోభన గారిని రిఫరెన్స్ తీసుకున్నాం

Published on May 27, 2024 3:00 PM IST

యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాలతో మే 31వ తేదీన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో యూత్ సెన్సేషన్ నేహా శెట్టి ముచ్చటించింది. మరి ఆమె ఎలాంటి విశేషాలు పంచుకుందో ఈ ఇంటర్వ్యూలో చూద్దాం.

సినిమాలో మీ పాత్ర కోసం చెప్పండి?

బుజ్జి అనేది 90లలో ధనవంతుల కుటుంబానికి చెందిన పల్లెటూరి అమ్మాయి పాత్ర. అందంగా కనిపిస్తూనే, ధృడంగా ఉండే పాత్ర ఇది. ట్రైలర్ లో గమనిస్తే మిగతా పాత్రలతో పోలిస్తే బుజ్జి పాత్ర భిన్నంగా ఉంటుంది. ట్రైలర్ లో మీకు అందంగా, సౌమ్యంగా కనిపిస్తుంది. కానీ చాలా శక్తిగల మహిళ పాత్ర ఇది. సినిమాలో ఈ పాత్రకి సంబంధించి ఆశ్చర్యకర విషయాలు ఉంటాయి. బుజ్జి అనేది సినిమాలో బలమైన పాత్రలలో ఒకటి. ఒకమ్మాయిలో ఎన్ని భావోద్వేగాలు ఉంటాయో అవన్నీ ఇందులో చూడొచ్చు.

ఈ సినిమా ఎలా ఉండబోతుంది?

ఈ సినిమా స్క్రిప్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఒక కుటుంబ ప్రయాణం ఉంటుంది. 90 లలో రత్న అనే పాత్రతో పాటు రత్నమాల, బుజ్జి పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. ఇది ఒక జీవిత కథ. ప్రచార చిత్రాలు చూసి యాక్షన్ మాత్రమే ఎక్కువ ఉంటుంది అనుకోవద్దు. రొమాన్స్, కామెడీ, డ్రామా అన్నీ ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా సినిమా ఉంటుంది.

పీరియాడిక్ సినిమా కదా అందుకు తగ్గట్టు మీ పాత్రకి ఎలా ప్రిపేర్ అయ్యారు?

డైరెక్టర్ గారు నాకు శోభన గారిని రిఫరెన్స్ గా చూపించారు. చీరకట్టు, జుట్టు, కళ్ళ కాటుక ఇలా ప్రతి దాని మీద ఎంతో శ్రద్ధ పెట్టాము. 90ల నాటికి తగ్గట్టుగా నా ఆహార్యాన్ని మార్చుకోవడమే కాకుండా.. అప్పటి నటీమణుల అభినయం ఎలా ఉండేదో తెలుసుకొని, దానికి తగ్గట్టుగా హావభావాలు పలికించాను. నేను ఇప్పటివరకు ఎక్కువగా మోడ్రన్ పాత్రలే చేశాను. కానీ బుజ్జి పాత్ర అలా కాదు. అందుకే దానికి తగ్గట్టుగా హోంవర్క్ చేశాను. అయితే యాస విషయంలో మాత్రం నేను ఎటువంటి హోంవర్క్ చేయలేదు. ఎందుకంటే బుజ్జి అనేది ధనవంతుల అమ్మాయి పాత్ర కాబట్టి.. రత్న పాత్రలాగా మాటల్లో పెద్దగా యాస ఉండదు. పైగా మాటల కంటే ఎక్కువగా కళ్ళతోనే భావాలను పలికించే పాత్ర ఇది. ఈ బుజ్జి పాత్ర నాకు ఎంతగానో పేరు తెచ్చి పెడుతుంది.

విశ్వక్ సేన్ తో వర్క్ కోసం చెప్పండి?

విశ్వక్ సేన్ తో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. తీవ్ర ఎండలో కూడా షూట్ చేశాడు. మేము మంచి స్నేహితులయ్యాం. అందుకే ఎటువంటి సన్నివేశాల చిత్రీకరణలోనూ మేము ఇబ్బంది పడలేదు.

అంజలి గారి గురించి చెప్పండి?

మా కాంబినేషన్ లో ఎక్కువగా సన్నివేశాలు లేవు. కానీ ఆమె గురించి చెప్పాలంటే మాత్రం.. నిజ జీవితంలో చాలా సరదాగా ఉంటారు. సెట్ అందరితో మాట్లాడుతూ ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. విషాద సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నేను మౌనంగా కూర్చుంటాను. కానీ ఆమె అలా కాదు. అప్పటివరకు నవ్వుతూ ఉండి, టేక్ కి వెళ్ళగానే పాత్రకి తగ్గట్టుగా మారిపోతారు. అనుభవం గల నటిగా అంజలి గారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.

షూటింగ్ టైం లో మీకు బాగా ఛాలెంజింగ్ గా అనిపించిన అంశం ఏంటి?

వేసవి నుంచి వేసవి వరకు ఏడాది పాటు ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. అధిక ఎండ వల్ల ఇబ్బంది పడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఒకసారి రాజమండ్రిలో షూట్ చేస్తున్న సమయంలో నేను లేను కానీ.. అప్పుడు అక్కడ ఎండలకి మా చిత్ర బృందంలోని పలువురికి వడదెబ్బ కూడా తగిలింది.

మిమ్మల్ని చూస్తే అందరికీ డీజే టిల్లులో మీరు పోషించిన రాధిక పాత్రనే గుర్తుకొస్తుంది. అందరూ మిమ్మల్ని అలా రాధిక అని పిలుస్తుంటే ఏమనిపిస్తుంది?

మనం పోషించిన పాత్ర పేరుతో మనల్ని పిలవడం అనేది.. ఏ నటులకైనా గొప్ప ప్రశంస. పోలిక అని కాదు కానీ.. షారుఖ్ ఖాన్ గారిని బాద్షా అని పిలుస్తారు. నేను కెరీర్ ప్రారంభంలోనే అలా రాధిక అని పేరు తెచ్చుకోవడం సంతోషంగా ఉంది. ప్రేక్షకుల హృదయాల్లో ఆ పాత్ర అంతటి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అందుకే వాళ్ళు అభిమానంలో రాధిక అని పిలుస్తున్నారు. దానిని గౌరవంగానే భావిస్తున్నాను.

సితార ఎంటర్టైన్మెంట్స్ తో వర్క్ కోసం చెప్పండి?

సితార సంస్థ అనేది ఇల్లు లాంటిది. వారి ప్రొడక్షన్ లో సినిమా చేయడం సంతోషంగా ఉంది. మునుముందు సితారలో మరిన్ని సినిమాలు చేసే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

మీ సినిమా దర్శకుడు కృష్ణ చైతన్య గురించి?

కృష్ణ చైతన్య గారు చాలా నెమ్మదిగా మాట్లాడతారు. చాలా మంచి మనిషి. ఆయన ఈ కథ రాసిన విధానం గానీ, దానిని తెరకెక్కించిన విధానం గానీ అద్భుతం.

మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం చెప్పండి?

ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కోసం చూస్తున్నా, నెక్స్ట్ బెల్లంకొండ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయబోతున్నాను. త్వరలోనే ప్రారంభమవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు