ఇంటర్వ్యూ : రాశిఖన్నా – రవితేజ ఎనర్జీ లెవెల్స్ అందుకోడానికి చాలా కష్టపడ్డా!

Rashi-Khanna
రాశి ఖన్నా.. తెలుగులో ప్రస్తుతం వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతోన్న హీరోయిన్. తాజాగా రవితేజ సరసన ఆమె హీరోయిన్‌గా నటించిన ‘బెంగాల్ టైగర్’ సినిమా డిసెంబర్ 10న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా బెంగాల్ టైగర్ సినిమా విశేషాలతో పాటు తన కెరీర్ ప్లానింగ్స్ గురించి తెలియజేస్తూ రాశి ఖన్నా ఇంటర్వ్యూలో చెప్పిన విశేషాలు..

ప్రశ్న) బెంగాల్ టైగర్ ఎలా వచ్చింది?

స) నేను నటించిన ‘జిల్’ సినిమా చూసిన దర్శకుడు సంపత్ నంది, బెంగాల్ టైగర్ కోసం నన్ను సంప్రదించారు. ఆ సమయంలోనే ఆయన చెప్పిన కథతో పాటు నా రోల్ కూడా బాగా నచ్చి వెంటనే ఓకే చేసేశా.

ప్రశ్న) ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతోంది?

స) ఈ సినిమాలో నేను శ్రద్ధా అనే ఈతరం అమ్మాయిగా కనిపిస్తా. తండ్రితో అన్ని విషయాలను షేర్ చేసుకోగల అమ్మాయికి, ఆ తండ్రికి మధ్యన ఉండే ఎమోషన్ చాలా బాగుంటుంది. ఇక ఈ సినిమాలో రావు రమేష్ నా తండ్రిగా నటించారు. మా ఇద్దరి కాంబినేషన్‌లోని సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి.

ప్రశ్న) బెంగాల్ టైగర్ సినిమాకు పనిచేసిన అనుభవం ఎలా ఉంది?

స) అద్భుతంగా ఉంది. చెప్పాలంటే నా కెరీర్‌కిది చాలా పెద్ద సినిమా. రవితేజ, తమన్నాలతో కలిసి నటించడం మరచిపోలేను. మంచి ఎంటర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది.

ప్రశ్న) ఈ సినిమాలో తమన్నా మేజర్ హీరోయిన్. రెండో హీరోయిన్‌గా నటించడం ఇబ్బందిగా అనిపించలేదా?

స) అలాంటిదేమీ లేదు. సినిమా ఒప్పుకున్నపుడే నా పాత్రకున్న ప్రాధాన్యం ఎంతో తెలుసు. అంతే కాకుండా తమన్నా నుంచి కూడా చాలా నేర్చుకున్నా. నన్ను తన సొంత సోదరిలా చూసుకుంటూ డ్యాన్స్, మేకప్ విషయంలో జాగ్రత్తలు చెప్పేది.

ప్రశ్న) రవితేజ ఎనర్జీ లెవెల్స్‌ను ఎలా అందుకోగలిగారు?

స) రవితేజ గారి ఎనర్జీ లెవెల్స్‌ను అందుకోవడం చాలా కష్టం. ఆయన ఆన్ స్క్రీన్ ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటారో ఆఫ్‌స్క్రీన్‌లో కూడా అంతే ఎనర్జిటిక్‌గా ఉంటారు. చెప్పాలంటే ఈ సినిమా తర్వాత రవితేజ మరింత పెద్ద ఫ్యాన్ అయిపోయా. ఈ సినిమాలో మా ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది.

ప్రశ్న) ఎక్కువగా గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారే?

స) గ్లామర్ పాత్రలనే ఎక్కువగా ఎంచుకోవడంలో తప్పేమీ లేదనుకుంటా. నా మటుకు గ్లామర్, డీ గ్లామర్ ఇలా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడమే అజెండాగా పెట్టుకున్నా. ఇంకా చెప్పాలంటే.. నేను డీ గ్లామర్ రోల్‌లో కనిపించిన ‘ఊహలు గుసగుసలాడే’ గ్లామర్ పాత్రల కన్నా ఎక్కువ క్రేజ్ తెచ్చిపెట్టింది.

ప్రశ్న) మీ గత చిత్రం ‘శివమ్’ బాక్సాఫీస్ వద్ద ఫెయిలనప్పుడు అప్‌సెట్ అయ్యారా?

స) నన్నడిగితే ఫెయిల్యూర్స్ కూడా మనకు చాలా నేర్పిస్తాయనే నమ్ముతా. ఆ ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకొని ఏవైనా తప్పులు చేసి ఉంటే మళ్ళీ అలా చేయకుండా వెళ్ళిపోవడమే మన పని. ఇకపోతే శివమ్ సినిమాతో నటిగా బాగా మెరుగయ్యా. ఆ విషయంలో సంతృప్తిగానే ఉన్నా.

ప్రశ్న) బాలీవుడ్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా?

స) లేవు. నేనిప్పుడు పూర్తిగా హైద్రాబాద్‌కు మారిపోయా. ప్రస్తుతం నా దృష్టంతా తెలుగు సినిమాలపైనే! ఇప్పటికిప్పుడు బాలీవుడ్‌కు వెళ్ళిపోవాలన్న ఆలోచన లేదు.

ప్రశ్న) ఈమధ్య బాగా సన్నబడ్డారు. ఏదైనా ప్రత్యేక కారణమా?

స) సన్నబడ్డం మంచిదే కదా! లుక్ విషయంలో చిన్న మార్పు కోరుకున్నా. అందుకోసమే సన్నబడ్డా. అదే విధంగా కాస్ట్యూమ్స్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నా. అదలా ఉంచితే సినిమా సినిమాకూ కొత్తగా కనిపిస్తేనే మనం ఎదుగుతున్నట్టు!

ప్రశ్న) సాయిధరమ్ తేజ్‌తో చేస్తోన్న ‘సుప్రీమ్’ ప్రోగ్రెస్ ఏంటి?

స) సుప్రీమ్ సినిమా విషయంలో నేను చాలా ఎగ్జైటింగ్ ఉన్నా. ఇందులో ఓ పోలీస్‌గా కనిపిస్తా. ఆ పాత్రలో మంచి ఫన్ ఉంది. సినిమా కూడా చాలా బాగా వస్తోంది.

Exit mobile version