
‘ఏమైంది ఈవేళ’ సినిమాతో దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సంపత్ నంది తన రెండవ సినిమాని రామ్ చరణ్ తో చేసి ‘రచ్చ’ సృష్టించాడు. ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనుకున్నారు, కానీ అది అనుకోని కారణాల వాళ్ళ ఆగిపోవడంతో మాస్ మహారాజ్ రవితేజతో చేసిన సినిమా ‘బెంగాల్ టైగర్’. ఈ సినిమా డిసెంబర్ 10న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సంపత్ నందితో కాసేపు ముచ్చటించి పలు విషయాలను తెలుసుకున్నాం. ఆ విశేషాలు మీ కోసం..
ప్రశ్న) అసలు ‘బెంగాల్ టైగర్’ అనే టైటిల్ పెట్టడానికి గల రీజన్ ఏమిటి?
స) ‘బెంగాల్ టైగర్’ అనే టైటిల్ అనౌన్స్ చేయగానే ఇది కలకత్తా బ్యాక్ డ్రాప్ మూవీ, పోలీస్ స్టొరీ అయ్యుంటది అని అందరూ అడుగుతున్నారు. కానీ ఇది కలకత్తా బ్యాక్ డ్రాప్ లో జరిగే పోలీస్ స్టొరీ కానీ కాదు. పక్కా తెలుగు స్టొరీ. ఇక టైటిల్ అనేది ఎందుకు ఇలా పెట్టాం అంటే బెంగాల్ టైగర్ లో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. అందుకే బెంగాల్ టైగర్ మాత్రమే మన జాతీయ జంతువూ అయ్యింది. ఆ బెంగాల్ టైగర్ లో ఉండే క్వాలిటీస్ అన్నీ మా హీరో రవితేజలో ఉంటాయి. అందుకే ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టాం.
ప్రశ్న) మరి బెంగాల్ టైగర్’ కథ ఎలా ఉంటుంది, ఎంత కొత్తగా ఉండబోతోంది?
స) బెంగాల్ టైగర్ అనేది గతంలో రాణి స్టొరీ, గ్రేట్ స్టొరీ, చరిత్రలో మిగిలిపోయే స్టొరీ కాదండి. రెగ్యులర్ కమర్షియల్ సినిమా. కానీ నేను హీరో పాత్ర చాలా కొత్తగా ఉండేలా డిజైన్ చేశా, అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనేది చాలా కొత్తగా ఉండేలా చూసుకుంటూ కంప్లీట్ కమర్షియల్ సినిమాగా దీన్ని రెడీ చేసాను. రవితేజ గారి ఫాన్స్, రెగ్యులర్ సినిమా లవర్స్ కి ఏమేమి ఉంటే నచ్చుతాయో అవన్నీ పొందుపరిచి తీసిన సినిమానే ‘బెంగాల్ టైగర్’.
ప్రశ్న) మరి రవితేజని గత సినిమాలతో పోల్చుకుంటే ఇందులో ఎంత కొత్త పాత్రలో చూపించనున్నారు?
స) ఆత్రేయపురం అనే విలేజ్ లో కంప్యూటర్స్ లో మాస్టర్స్ ఫినిష్ చేసి అల్లర చిల్లరగా తిరిగే కుర్రాడు మన హీరో రవితేజ. అతని పేరు ఆకాష్ నారాయణ్. అలా అల్లరి చిల్లరగా తిరిగే రవితేజకి ఒక విషయంలో అవమానం జరుగుతుంది. అక్కడి నుంచి ఒక లక్ష్యం పెట్టుకొని తన జర్నీ మొదలు పెడతాడు. ఆ జర్నీలో తన లక్ష్య సాధన కోసం ఏం చేసాడు అన్నదే సినిమా.
ప్రశ్న) ట్రైలర్ చూసిన తర్వాత రవితేజ పాత్ర ఇది వరకూ వచ్చిన తన సినిమాల మాదిరిగానే ఉందనే విమర్శలు వచ్చాయి. దానిపై మీ కామెంట్?
స) అలాంటి పోలికలు ఏమీ ఉండవు. ఒకవేళ ట్రైలర్ కట్ లో వారికలా అనిపించి ఉండచ్చు. కానీ సినిమా చూస్తే మీకు వేరే పాత్రలేవీ గుర్తుకు రావు, అలాగే కొత్త పాత్రని రవితేజకి డిజైన్ చేసానని అంటారు. ఈ కథ కూడా వేరే ఏ సినిమాకి సంబంధం ఉండదు.
ప్రశ్న) బొమన్ ఇరాని లాంటి వారిని పెడితే సినిమాకి ఓ ఫ్రెష్ నెస్ ఉంటుందని పెట్టారా లేక కథ ఆయన్ని డిమాండ్ చేసిందా?
స) మీరన్నట్టు 50% ఫ్రెష్ నెస్ కోసం బోమన్ ఇరాని గారిని అనుకున్నాం. అలాగే బొమన్ గారు ఇందులో ఒక సిఎంగా కనిపించాలి. సిఎంగా రాజసం వచ్చే లుక్, పాత్రలో లౌడ్ నెస్ ఉండదు అంటే చాలా సెటిల్ గా పెర్ఫార్మన్స్ ఇస్తూ నెగటివ్ షేడ్స్ ని చూపించాలి. అలా నేను పూర్తి పాత్రని డిజైన్ చేసుకున్నప్పుడు ఆయనే పర్ఫెక్ట్ అని అప్రోచ్ అయ్యాం ఆయన పాత్ర నచ్చి వెంటనే ఓకే అన్నారు.
ప్రశ్న) కేవలం గ్లామర్ అట్రాక్షన్ కోసం ఇద్దరు హీరోయిన్స్ ని తీసుకున్నారా? లేక కథకి అవసరం ఉండి తీసుకున్నారా?
స) ఒక 50% గ్లామర్ అట్రాక్షన్ కోసం ఇద్దరినీ పెట్టాం, అలాగే ఇద్దరూ కథలో కూడా హెల్ప్ అవుతారు. మన హీరో లక్ష్యం చేరడానికి కొంత పార్ట్ తమన్నా హెల్ప్ అయితే, కొంత పార్ట్ రాశీ ఖన్నా హెల్ప్ అవుద్ది. ఈదరికీ కథలో ప్రాముఖ్యత ఉంటుంది.
ప్రశ్న) పవన్ కళ్యాణ్ సినిమా కోసం రెండున్నరేళ్ళు స్పెండ్ చేసారు. మరి అది ఆగిపోవడానికి కారణం ఏంటి? ఆ సినిమా చేయడం లేదు అన్నప్పుడు మీరెలా ఫీల్ అయ్యారు?
స) రెండున్నరేళ్ళు సమయం వెచ్చించాను, కానీ ఇండస్ట్రీలో మనం అనుకున్న సినిమాలు పలు కారణాల వల్ల, పరిస్థితుల వాళ్ళ ఆగిపోతాయి, మళ్ళీ మనం వేరే సినిమాలు చేస్తూ ఉంటాం. ఇలాంటివి ఇండస్ట్రీలో సర్వ సాధారణం అని నేను నమ్ముతాను. ఈ విషయంలో ఒక్కటి మాత్రం క్లారిటీగా చెప్పదలచుకున్నాను. పవన్ గారితో సినిమా ఆగిపోవడానికి కారణం అప్పటి పరిస్థితులే తప్ప వ్యక్తులు మాత్రం కాదు. ఇక పవన్ గారితో సినిమా చేయడమే డ్రీంగా పెట్టుకున్న నాకు సినిమా ఆగిపోయినప్పుడు బాధ పడ్డాను. మళ్ళీ నెక్స్ట్ ఏంటా అని ఆలోచించి తదుపరి సినిమాలో బిజీ అయ్యాను.
ప్రశ్న) మరి ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ తో సంబంధాలు ఎలా ఉన్నాయి?
స) నాకు పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఎలాంటి భేదాలు లేవు. ఆ సినిమా అనుకున్నప్పుడు ఎంత మంచి రిలేషన్ ఉందో, ఇప్పుడూ అదే రిలేషన్ షిప్ ఉంది. ప్రస్తుతం ఆయన కోసం ఒక లైన్ అనుకొని స్టొరీ డెవలప్ చేస్తున్నాను. త్వరలోనే ఆయనకీ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఆయన ఓకే అంటే ఆయనతో సినిమా కూడా చేస్తాను.
ప్రశ్న) రవితేజ అంటే ఎనర్జీ అంటారు.. మరి ఆయనతో ఈ వర్కింగ్ జర్నీ ఎలా ఉంది?
స) నాకు ఆకలేస్తున్న టైంలో ఈ సినిమా ఓకే చేసి అన్నం పెట్టిన వ్యక్తి. ఆయనతో జర్నీ వండర్ఫుల్. రవితేజ గారితో పనిచేస్తున్నప్పుడు ప్రతి రోజు, ప్రతి షాట్ లోనూ పిచ్చ కిక్ ఉంటుంది. మనం పేపర్ మీద రాసుకునేటప్పుడే ఒక ఇమాజినేషన్ తో రాసుకుంటాం, ఆయన అదే సీన్ ని చేసేటప్పుడు మనం అనుకున్న ఇంపాక్ట్ డబుల్ గా కనపడుతుంది. ప్రతి సీన్ ని చాలా రియలిస్టిక్ వేలో ఎలివేట్ చేస్తారు.
ప్రశ్న) బెంగాల్ టైగర్ కి హెల్ప్ అయ్యే మేజర్ హైలైట్స్ ఏంటి?
స) బెంగాల్ టైగర్ అనేది రవితేజ గారి మీటర్ లో సాగుతూనే కంటెంట్ అండ్ స్క్రీన్ ప్లే హైలైట్ అయ్యేలా ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఉండే ఓ 6 నిమిషాల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా కొత్తగా హైలైట్ అవ్వడమే కాకుండా, పెద్ద హైలైట్ అవుతుంది. ఓవరాల్ గా థియేటర్స్ కి వచ్చే ప్రతి ఒక్కరినీ పక్కాగా ఎంటర్టైన్ చేసే సినిమా ‘బెంగాల్ టైగర్’.
ప్రశ్న) పలువురు స్టార్ హీరోస్ తో మీ నెక్స్ట్ మూవీ ఉంటుందని అంటున్నారు. దానిపై మీ కామెంట్?
స) పలువురు స్టార్ హీరోస్ నుంచి పిలుపు వచ్చింది, కలిసి చేద్దాం అన్నారు. కానీ నేను ఇంకా ఎవ్వరికీ కథ చెప్పలేదు. బెంగాల్ టైగర్ అనే సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే ఫలితమే నేను ఏ స్టార్ తో సినిమా చేస్తాను అనేది నిర్ణయిస్తుందని భావిస్తున్నాను.