ఇంటర్వ్యూ: తిరు- అంత ప్రమాదం జరిగినా… గోపీచంద్ నిబ్బరంగా ఉన్నారు.

ఇంటర్వ్యూ: తిరు- అంత ప్రమాదం జరిగినా… గోపీచంద్ నిబ్బరంగా ఉన్నారు.

Published on Oct 3, 2019 1:28 PM IST

మాచో స్టార్ గోపీచంద్ నటించిన స్పై థ్రిల్లర్ చాణక్య ఇంకా రెండు రోజులలో విడుదల కానుంది. దర్శకుడు తిరు తెరకెక్కించిన చాణక్య మూవీ ఏ కె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా మెహ్రీన్ ఫిర్జా గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు తిరు పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఆ విశేషాలు మీ కోసం…

గోపీచంద్ గారితో ఈ చిత్రం ఎలా కార్యరూపం దాల్చిందో చెప్పండి?

గోపీచంద్ తో దర్శకుడు శివ శౌర్యం చిత్రం చేసిప్పటినుండే నాకు పరిచయం ఉంది. శివ నేను ఒక తమిళ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పనిచేసిన అనుభందం ఉంది. శౌర్య చిత్రం సినిమా షూటింగ్ టైం లోనే గోపీచంద్ తో ఒక మంచి యాక్షన్ మూవీ చేయాలని నిర్ణయించుకున్నాను. కొద్దిరోజుల క్రితం చాణక్య మూవీ స్క్రిప్ట్ వినిపించగా ఆయనకు నచ్చడంతో ఈ మూవీ సెట్స్ పైకెళ్లింది.

తెలుగు చిత్రాలతో మీకున్న అనుభందం ఏమిటీ?

మాది ఆంధ్ర తమిళనాడు బోర్డర్ లోని ఓ గ్రామం. మాకు చిత్తూర్ కేవలం 29కిలోమీటర్ల దూరంలో ఉండేది. దీనితో చిన్నప్పటినుండి తెలుగు సినిమాలు చూస్తూ పెరిగాను. ముఖ్యంగా చిరంజీవి గారి సినిమాలు చాలా చూడటం జరిగింది.

స్పై చిత్రాలు తీయాలి అంటే చాలా అవగాహన సన్నద్ధత అవసరం, మీరెలాంటి రీసెర్చ్ చేశారు?

స్క్రీన్ ప్లే రాసుకోవడానికి ముందు కొన్ని గూఢచారి సంస్థలైనటువంటి ఐ ఎస్ ఐ, సి ఐ ఏ, రా వంటి వాటి గురించి బాగా చదివాను. అసలు స్పై ఏజెంట్స్ ఎలా ఉంటారు, వారి బాడీ లాంగ్వేజ్, రోల్స్ ఇలా చాలా విషయాలపై రీసెర్చ్ చేసి స్క్రిప్ట్ రాసుకోవడం జరిగింది.

ఈ చిత్రం చేయడానికి మీకు వాస్తవ జీవితంలో ఎవరైనా స్ఫూర్తి ఉన్నారా?

ఉన్నారండీ.., రవీంద్ర అనే ఒక స్పై ఉన్నారు. ఆయన బ్లాక్ టైగర్ అని బాగా ప్రసిద్ధి. ఆయన కూడా నా మూవీకి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. అందుకే చాణక్య చిత్రంలో ఒక స్పై పాత్రకు రవీంద్ర అని పేరు పెట్టడం జరిగింది.

చాణక్య మూవీ అసలు దేని గురించి ?

చాణక్య మూవీ ఒక స్పై చేపట్టే ఆపరేషన్ గురించి. ఆ ఆపరేషన్ ఏమిటి? అతను చేధించాల్సిన లక్ష్యం ఏమిటీ? అనేది మీరు వెండి తెరపై చూడండి. వాస్తవికతకు దగ్గరగా, కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా బ్యాలెన్స్డ్ గా చాణక్య మూవీ తెరకెక్కించాను. ఒక రా ఏజెంట్ చూసినా..,సంతృప్తి పడేలా చిత్రం ఉంటుంది.

మీరు ఈ చిత్రంలో పాకిస్తాన్ ని నెగెటివ్ గా చూపించినట్టున్నారు?

అలా అని కాదండి, నేను ఈ చిత్ర కథను పాకిస్థాన్ ఇండియా కోణంలో రాయలేదు, చూపించలేదు. నా మూవీలో విలన్ పాకిస్తాన్ లో ఉంటాడు అంతే కానీ, పాకిస్థాన్ చెడ్డది అన్నట్లు కాదు. ఇక్కడ మంచి చెడు అనేకోణంలో చెప్పాం కానీ, ఇండియా పాకిస్తాన్ కోణంలో కాదు. నాకు చాలా మంది ముస్లిం స్నేహితులు ఉన్నారు, ఈ చిత్ర స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు వారందరి మనోభావాలు నేను మనసులో పెట్టుకున్నాను.

చాణక్య మూవీ హాలీవుడ్ మూవీకి ఇన్స్పిరేషన్ అని అంటున్నారు?

నాట్ ఎట్ ఆల్ అండీ..,నిజానికి ఈ విషయంపై నేనే స్పష్టత ఇద్దాం అని అనుకుంటున్నాను. సల్మాన్ ఖాన్ ఏక్తా టైగర్ చిత్రంతో కూడా ఈ మూవీని పోల్చుతున్నారు. నిజానికి ఇది కంప్లీట్ గా కొత్త కథ, సినిమా చూశాక మీకే ఆ విషయం అర్థం అవుతుంది.

ఈ చిత్ర షూటింగ్ సమయంలో గోపీచంద్ ప్రమాదానికి గురయ్యారు, కారణం?

అది షూటింగ్ 28వ రోజు అలాగే చివరి రోజు, ఒక ఫైట్ సన్నివేశం షూట్ చేస్తున్నాం. స్టార్ చేసి ఉన్న బైక్ కారణంగా ఆయనకు పెద్ద గాయమే అయ్యింది. నేను షాక్ లో ఉన్నాను, కానీ గోపీచంద్ చాలా నిబ్బరంగా కారు తీసుకురండి హాస్పిటల్ కి వెళదాం అని చెప్పారు. మారు మూల గ్రామంలో ఒక చిన్న గవర్నమెంట్ హాస్పిటల్ లో ఫస్ట్ ఎయిడ్ చేశాక, 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైపూర్ కి తీసుకెళ్లడం జరిగింది. అంత పెద్ద గాయంలో కూడా ఆయన చాలా ధైర్యంగా ఉన్నారు.

మూవీ విజయం పై కాన్ఫిడెంట్ గా ఉన్నారా?
ఖచ్చితంగా …, ఈ మూవీ స్క్రిప్ట్ పై ఐదేళ్లు పని చేయడం జరిగింది. నిర్మాతలు , నేను మూవీ విజయం పట్ల చాలా ఆశాభావంతో ఉన్నాం.

మీరు భవిష్యత్ ప్రణాళికలు ఏమిటీ?

నిజంగా చెప్పాలంటే..,తెలుగు మరియు తమిళ భాషలో కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. కానీ ప్రస్తుతం నా ధ్యాసంతా చాణక్య చిత్రం పైనే. ఈ మూవీ విడుదల అయ్యాక వాటి గురించి ఆలోచిద్దాం అని నిర్ణయించుకున్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు