ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: శ్రీనివాస్ రెడ్డి- రామానాయడుగారు చెప్పిన మాట నేను ఎప్పటికీ మర్చిపోలేను..!

Published on Apr 20, 2020 1:03 pm IST

లాక్ డౌన్ ఇంటర్వ్యూ సిరీస్ లో మన నెక్స్ట్ గెస్ట్ నటుడు శ్రీనివాస రెడ్డి.ఇష్టం సినిమాతో వెండితెరకు పరిచయమైన శ్రీనివాస రెడ్డికి ఇడియట్ బ్రేక్ ఇవ్వగా వెంకీ, దుబాయ్ శీను, డార్లింగ్ వంటి సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈయన కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టి హీరో గా కూడా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన భాగ్యనగరంలో గమ్మత్తు సినిమాకు దర్శక నిర్మాతగా కూడా మారారు. కామెడీలో తనదైన శైలి, ప్రత్యేకత కలిగిన శ్రీనివాస రెడ్డిని లాక్ డౌన్ పై అభిప్రాయాలు, తన కొత్త చిత్రాల విశేషాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ విశేషాలు మీకోసం…

హాయ్ అండీ.. ఎవరూ ఊహించని కొత్తపరిస్థితి ఎదురైంది. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ లాక్ డౌన్ ని ?

లాక్ డౌన్ మనం ఊహించిన దానికి కంటే ధారుణంగా, ఎక్కువ సమయం పడుతుందని ముందుగానే ఊహించాను. ఐతే ఎన్ని రోజులు లాక్ డౌన్ ఉన్నా, అది మన మంచి కోసమే.. ప్రాణాలు కాపాడుకోవాలంటే లాక్ డౌన్ తప్పదు.

 

ఈ లాక్ డౌన్ టైం లో మీ దినచర్య ఏమిటీ?

పని మనిషి కూడా రాని పరిస్థితుల నేపథ్యంలో నా భార్యకు పనులలో హెల్ప్ చేస్తున్నాను. అలాగే మా రెండేళ్ల పాప సంరక్షణ చూసుకోవడం, భార్య పిల్లలతో గడపడం వంటివి చేస్తున్నాను. కోవిడ్ మరణాలు, ధారుణాల గురించి వినడం ఇష్టం లేక టీవీ చూడడం మానేశాను.

 

ప్రస్తుతం ఏఏ సినిమాలలో నటిస్తున్నారు?

కళ్యాణ్ రామ్ సినిమాతో పాటు, బెల్లంకొండ శ్రీనివాస్ మూవీలో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలలో నేను చాలా ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తున్నాను. ఆ సినిమాల విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

 

డైరెక్టర్ మరియు నిర్మాతగా మారాలనే ఆలోచన ఎలా వచ్చింది?

నేను ఓ సినిమాలో హీరోగా నటించాల్సి ఉండగా అనుకోని కారణాల వలన ఆ మూవీ హోల్డ్ లో పడింది. దానితో నాకు మూడు నెలల గ్యాప్ రావడంతో భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు మూవీ స్క్రిప్ట్ సిద్ధం చేశాను. ఆ ప్రాజెక్ట్ నేనెంతో ఇష్టపడి రాసుకున్నది. అందుకే దానిని నేనే స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాను.

 

ఆ సినిమా ఫలితం మీపై ఎలాంటి ప్రభావం చూపించింది?

ఆ సినిమా ఫెయిల్ కావడంతో నేను చాలా డిస్సప్పాయింట్ అయ్యాను. నిర్మాతగా చాలా డబ్బులు నష్టపోవడంతో పాటు పరిశ్రమలో చెడ్డ పేరు మూటగట్టుకున్నాను. ఐతే అందరూ అనుకున్నంత బ్యాడ్ గా మూవీ లేదు, ఓ కొత్త దర్శకుడు తీశాడన్న భావన రాలేదు అని కొందరు కాంప్లిమెంట్ ఇవ్వడంతో ఆనందం వేసింది.

 

హీరోగా మారిన తరువాత మీకు కమెడియన్ గా అవకాశాలు తాగ్గాయనుకుంటా?

అది వాస్తవమనే చెప్పాలి. నేను వరుసగా హీరో పాత్రలు చేస్తుంటే కొందరు దర్శకులు నేను ఇక కామెడీ రోల్స్ చేయను అని అపార్థం చేసుకుంటున్నారు. దానితో కమెడియన్ గా అవకాశాలు కొంచెం తగ్గిపోయాయి. నేను కామెడీ పాత్రలకు ఎప్పుడూ సిద్ధమే అని ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేస్తున్నాను.

 

బుల్లితెర నుండి మీరు వచ్చారు, ఇప్పుడు ఆ పరిశ్రమ ఉచ్ఛ స్థితిలో ఉంది .. మళ్ళీ అటువైపు వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా?

ఖచ్చితంగా.. అందులో తప్పేముంది?. నాకు బుల్లి తెరపై హోస్ట్ గా అలాగే డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ వంటి వాటిలో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాలని ఉంది.

 

మీరు ఇండస్ట్రీకి వచ్చి 20ఏళ్ళు అవుతుంది. ఇన్నేళ్ల సినీ జర్నీ ఎలా అనిపిస్తుంది?

తలుచుకుంటే అప్పుడే 20ఏళ్ళు అయిపోయాయా అనిపిస్తుంది. ఇన్నేళ్ల కెరీర్లో మంచి సక్సెస్ తో పాటు కొన్ని ఒడిదుడుకులు కూడా చూశాను. అనాలోచిత నిర్ణయాల వలన ఎదురైన గుణపాఠాలను గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్లడమే.

 

మళ్ళీ డైరెక్షన్ చేసే ఆలోచన ఉందా?

రామానాయుడు గారు నాకు చెప్పిన ఒక మాట ఇప్పటికీ నాకు గుర్తుంది. ”ఎక్కడ సంపాదించింది అక్కడే పెట్టాలి” అని ఆయన చెప్పారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. ప్రస్తుతానికి నా ఆలోచన మంచి రోల్స్ చేయడమే.

 

సంబంధిత సమాచారం :

X
More