పవన్ పై వస్తున్న ఈ పుకార్లలో నిజమెంత?

Published on May 29, 2019 10:12 am IST

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో నడుస్తున్న హాట్ టాపిక్ పవన్ మళ్ళీ సినిమాలు చేయబోతున్నారని. పవన్ చిరకాల మితృడైన బండ్ల గణేష్ నిర్మాతగా, బోయపాటి దర్శకునిగా దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో సినిమా రాబోతుందని గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాలలో, వెబ్సైట్స్ లో ఈ వార్త ప్రముఖంగా వినిపిస్తుంది.
ఈ మూవీ చేస్తునందుకు పవన్ కు 40 కోట్ల భారీ పారితోషికం కూడా గణేష్ చెల్లిస్తున్నాడని చెవుతున్నారు. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ కొన్ని మాధ్యమాలు ప్రముఖంగా ఈ విషయంపై దృష్టి పెడుతున్నాయి.

అసలు ఈ వార్తలలో నిజమెంత అని విశ్లేషిస్తే ఈ సారి ఎన్నికలలో జనసేన కొన్ని సీట్లు గెలుచుకొని నిర్ణయాత్మకమైన పాత్ర వహిస్తుందని అందరూ భావించారు. కానీ ఇందుకు భిన్నంగా జనసేన అధినేత పోటీ చేసిన రెండు స్థానాలలో ఓటమి చవిచూశారు. కేవలం ఒక సీటు మాత్రమే గెలిచి ఆ పార్టీ, శ్రేణులను నిరాశకు గురి చేసింది.
ఐతే పార్టీ అధినేత పవన్ గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజల తరుపున మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అన్నారు.

పవన్ నేను ఇక సినిమాలు చేయను అని స్పష్టంగా చెప్పిన సందర్భాలు లేవు, అలాగే ఎన్నికల నామినేషన్ అఫిడవిట్ లో తను కొందరు నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్స్ అమౌంట్ ని అప్పుగా చూయించారు. మరి ఆ నిర్మాతలకు ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి చెల్లిస్తారా లేక వారికి సినిమాలు చేస్తారా…?అనేది సస్పెన్స్. ఏది ఏమైనా పవన్ అభిమానులలో కొందరు ఆయన రాజకీయాలలోనే ఉండి పోరాడాలని కోరుకుంటుంటే , మరి కొందరు తెలుగు తెరపై ఆయన్ని చూసి ఆనందించాలని భావిస్తున్నారు. మరి ఎవరి కోరిక పవన్ తీరుస్తాడో… కాలమే సమాధానం ఇవ్వాలి.

సంబంధిత సమాచారం :

More