ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : , జూలై 2, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : ఐశ్వర్య రాజేష్, సముద్రఖని, నరేష్ అగస్త్య, సునీల్, రాజీవ్ కనకాల, రవివర్మ, జ్వాలా కోటి, సుధాకర్ కోమాకుల, బెనర్జీ, రాజా చెంబోలు తదితరులు.
దర్శకులు : గ్యారీ బి.హెచ్ (Garry BH)
నిర్మాతలు : రాహుల్ తమడ, సందీప్ రెడ్డి బొర్ర
సంగీతం : ప్రవీణ్ లక్కరాజు
ఛాయాగ్రహణం : వంశీ పచ్చిపులుసు
కూర్పు : గ్యారీ బి.హెచ్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో, ప్రముఖ నటుడు సముద్రఖని కీలక పాత్రలో నటించిన సరికొత్త తెలుగు వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’. గ్యారీ బి.హెచ్ దర్శకత్వంలో వచ్చిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు వచ్చింది. మరి ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
కథ :
ఈ సిరీస్ అంతా ఒక పోర్ట్ సిటీ అయిన ‘ఇసకపట్నం’ నేపథ్యంతో పాటు, అక్కడ సాగే అధికార దాహం చుట్టూ తిరుగుతుంది. ఏమీ లేని వాడిగా ఇసకపట్నంలో అడుగుపెట్టిన మిస్టర్ నాయుడు (సముద్రఖని), అక్కడ చక్రం తిప్పుతున్న చిన్నారావు (రాజీవ్ కనకాల)ను చంపి ఆ నగరానికి తానే రాజుగా ఎదుగుతాడు. రాజకీయ నాయకులు, పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్‌తో నాయుడు తిరుగులేని శక్తిగా మారుతాడు. అయితే, తండ్రి చేసే ఈ అరాచకాలు ఆయన కూతురు భారతి (ఐశ్వర్య రాజేష్)కి అస్సలు నచ్చవు. మరోవైపు, నాయుడు శత్రువు ప్రతాప్ వర్మ (రవివర్మ) అతడిని ఎలాగైనా గద్దె దించాలని చూస్తుంటాడు. ఈ క్రమంలో వర్మను ఎదుర్కోవడానికి నాయుడు వేసే వ్యూహాలు, గ్రూపుల మధ్య గొడవలు, హింస ఎలాంటి పరిణామాలకు దారితీశాయనేదే ఈ సిరీస్ కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సిరీస్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది నటీనటుల పర్ఫార్మెన్స్ గురించే. పవర్ఫుల్ మరియు అధికార దాహం ఉన్న వ్యక్తిగా సముద్రఖని తన నటనతో మెప్పించారు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో ఐశ్వర్య రాజేష్ మరోసారి ఆకట్టుకుంది. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని పైకి ఎదగాలనుకునే యువకుడిగా నరేష్ అగస్త్య ప్రామిసింగ్ నటనను కనబరిచాడు. జ్వాలా కోటి, సుధాకర్ కోమాకుల, బెనర్జీ, రాజా చెంబోలు తమ పరిధి మేర చక్కగా నటించారు. కథనంలో లోపాలున్నా, ఈ నటీనటుల పర్ఫార్మెన్స్ వల్ల సిరీస్‌ను కొంతవరకు చూడగలుగుతాం.
మైనస్ పాయింట్స్ :
సినిమాల్లో, వెబ్ సిరీస్‌లలో పవర్ పాలిటిక్స్, గ్యాంగ్‌స్టర్ డ్రామాలు ఇప్పటికే చాలా చూసేశాం. కాబట్టి ఇలాంటి రొటీన్ పాయింట్‌తో వచ్చినప్పుడు కథనంలో ఏదైనా కొత్తదనం ఉండాలి. కానీ, ‘ఇసకపట్నం’ ఆ విషయంలో పూర్తిగా తడబడింది. సిరీస్ పేసింగ్ పర్వాలేదనిపించినా, స్క్రీన్‌ప్లేలో ప్రేక్షకుడిని కట్టిపడేసే హై మూమెంట్స్ కానీ, ఊహించని ట్విస్టులు కానీ లేవు. కథలో ఉండాల్సిన మెయిన్ టెన్షన్ ఎక్కడా కనిపించదు. కొన్ని సీన్లు బాగున్నప్పటికీ, అవి చాలా తక్కువ సమయమే ఉంటాయి.
క్యారెక్టరైజేషన్స్ విషయానికి వస్తే.. చాలా పాత్రలు గ్రే షేడ్స్‌తో ఉన్నప్పటికీ, వాటిని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోవడంతో ఒక దశ తర్వాత బోర్ కొడతాయి. ప్రధాన పాత్రల మరణాలకు సంబంధించిన సీన్స్ కూడా అంత ఇంపాక్ట్ చూపించవు. క్లైమాక్స్ ట్విస్ట్‌ను కూడా ముందే ఊహించేలా స్క్రీన్‌ప్లే రాసుకున్నారు. సముద్రఖని పాత్రకు ఎదురయ్యే ముప్పును బలంగా చూపించకపోవడం వల్ల డ్రామా పండలేదు. ఇక సునీల్ లాంటి నటుడికి చాలా వీక్ క్యారెక్టర్ ఇచ్చి వేస్ట్ చేశారు. ఐశ్వర్య రాజేష్ లవ్ ట్రాక్, నరేష్ అగస్త్య ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా ఫ్లాట్‌గా సాగుతాయి.
సాంకేతిక విభాగం :
సాంకేతికంగా చూస్తే.. ప్రవీణ్ లక్కరాజు అందించిన సంగీతం సోసోగా ఉంది. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ బాగుంది, 1980ల నాటి ఇసకపట్నం డార్క్ మోడ్‌ను, ఆ వాతావరణాన్ని తన కెమెరాలో బాగా క్యాప్చర్ చేశారు. ప్రొడక్షన్ డిజైన్, నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. గ్యారీ బి.హెచ్ ఎడిటింగ్ పర్వాలేదు కానీ, దర్శకుడిగా ఆయన ఇంకా మెరుగైన అవుట్‌పుట్ ఇవ్వాల్సింది. ఇంతటి పవర్ఫుల్ బ్యాక్‌డ్రాప్ ఉన్నప్పుడు సీన్లు ఇంకా స్ట్రాంగ్‌గా రాసుకోవాల్సింది. లీడ్ పాయింట్ బాగున్నా, ప్రెజెంటేషన్ లోపించింది.
తీర్పు :
మొత్తంగా చూసుకుంటే.. ‘ఇసకపట్నం’ అనేది ఒక సాధారణ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా. సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల నటన, గ్రిట్టీ బ్యాక్‌డ్రాప్ ఈ సిరీస్‌కు ప్లస్ పాయింట్స్ అయితే.. వీక్ స్క్రీన్‌ప్లే, సరైన డ్రామా లేకపోవడం, రొటీన్ సీన్స్ మైనస్ పాయింట్స్. నిజానికి ఒక కంప్లీట్ ఎంగేజింగ్ డ్రామాను ఆశించే వారికి ఈ సిరీస్ కొంత నిరాశ కలిగించవచ్చు, కానీ గ్యాంగ్‌స్టర్ కథలను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే మాస్ ఆడియన్స్‌కు మాత్రం ఇది ఓ మోస్తరుగా అనిపిస్తుంది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team
