‘జిల్లా’కు తెలుగులో అనూహ్య స్పందన!

jilla
తమిళ స్టార్ హీరో విజయ్, మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్.. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్లో రూపొందిన తమిళ సినిమా ‘జిల్లా’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి నిర్మించిన ఈ సినిమా గత సంవత్సరం పొంగల్ కానుకగా జనవరి 9న విడుదలై తమిళ నాట సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో ఈ సినిమాను చాలా మంది స్టార్ హీరోలు రీమేక్ చేయనున్నారని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. అయితే చివరకు ఈ సినిమాను అదే పేరుతో శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై తమటం కుమార్ రెడ్డి, ప్రసాద్ సన్నితిలు తెలుగులో డబ్ చేశారు.

నేసన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటించింది. తమిళంలో విడుదలై దాదాపు 18 నెలల తర్వాత తెలుగులో విడుదలైన ఈ సినిమా మొదటి వారాంతం మంచి కలెక్షన్లను సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లను అప్పుడే లాభాల బాట పట్టించిందని టాక్! ఇక ఈ సినిమాకు వస్తున్న స్పందనను చూసి దర్శక, నిర్మాతలు ఈ ఉదయం హైద్రాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేపట్నుంచి ‘జిల్లా’ కోసం మరిన్ని థియేటర్లను కేటాయిస్తున్నట్లు ఆర్.బీ.చౌదరి తెలియజేశారు. ఇప్పుడున్న థియేటర్ల సంఖ్యకు సుమారు మరో 25 థియేటర్లు జతకానున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version