
తెలుగు, తమిళ భాషల్లో అద్భుతమైన సినిమాలతో మెప్పించిన నటి జ్యోతిక, తమిళ సూపర్ స్టార్ సూర్యను పెళ్ళాడిన తర్వాత సినిమాలకు దూరమయ్యారు. మళ్ళీ తొమ్మిదేళ్ళ తర్వాత తాజాగా ’36 వయధినిలె’ అనే సినిమాతో ఆమె మన ముందుకొచ్చిన విషయం తెలిసిందే. గత వారం తమిళ నాట భారీ ఎత్తున విడుదల అయిన ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో పాటు కలెక్షన్లు కూడా బాగా వస్తున్నాయి. జ్యోతిక భర్త సూర్య ఈ సినిమాను స్వయంగా నిర్మించడం విశేషం.
ఇక తమిళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాను తెలుగులో డబ్ చేయాలన్న ఆలోచనలో సూర్య ఉన్నారట. తెలుగులో ‘చంద్రముఖి’తో పాటు ‘ఠాగూర్’, ‘మాస్’, ‘షాక్’ చిత్రాలతో మెప్పించిన జ్యోతికకు ఇక్కడ మంచి గుర్తింపు ఉంది. ఆ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను తెలుగులో విడుదల చేసే ఆలోచన ఉన్నట్లు సూర్య తెలిపారు. త్వరలోనే తెలుగు వర్షన్‌కు సంబంధించిన కార్యక్రమాలు మొదలుపెట్టనున్నామని తెలిపారు. జూన్ నెలలో ’36 వయధినిలె’ తెలుగు వర్షన్ విడుదలయ్యే సూచనలు ఉన్నాయి.