సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో ‘బ్రహ్మోత్సవం’ అనే ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి అందమైన సినిమా తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తోన్న సినిమా కావడంతో అనౌన్స్ అయిన రోజునుంచే బ్రహ్మోత్సవంపై మంచి ఆసక్తి కనిపిస్తూ వచ్చింది. మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత ఇలా ముగ్గురు హీరోయిన్లు నటించడం ఈ సినిమాకు విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన యూనిట్ తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో రెండో షెడ్యూల్ జరుపుకుంటోంది.
‘బ్రహ్మోత్సవం’ కోసం ప్రత్యేకంగా వేసిన ఓ సెట్లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్లో ఇప్పటికే ప్రణీత పాల్గొంటుండగా తాజాగా కాజల్ అగర్వాల్ కూడా జాయిన్ అయ్యారు. బ్రహ్మోత్సవం సెట్స్‌లో జాయిన్ అయ్యాయని, మళ్ళీ కొత్త జర్నీ మొదలైందని కాజల్ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓ ఫోటో పోస్ట్ చేశారు. విజయవాడ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలోనూ శ్రీకాంత్ అడ్డాల ఫ్యామిలీ సెంటిమెంట్‌నే ప్రధానాంశంగా తీసుకున్నారు. పీవీపీ సంస్థ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తోన్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
