కమల్ ‘చీకటి రాజ్యం’లో ఒకే ఒక్క పాట!

Kamal-Cheekati-Rajyam
కమల్ హాసన్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ‘చీకటి రాజ్యం’ (తమిళంలో తూంగవనం) పేరుతో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే! గతంలో కమల్ హీరోగా చేసిన పలు సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన రాజేష్ ఎమ్ సెల్వ ఈ సినిమాకు దర్శకుడు. ఇక తన కెరీర్ మొత్తం ఎప్పుడూ ఏదో ఒక ప్రయత్నంతో మెప్పిస్తూ వస్తోన్న కమల్, ఒకే ఒక్క రాత్రి జరిగే వినూత్న కథతో ‘చీకటి రాజ్యం’ రూపొందిస్తున్నారు. కేవలం 38 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి తెలిసింది. చీకటి రాజ్యంలో ఒకే ఒక్క పాట ఉందట. అది కూడా ఓ మాంటేజ్ టైటిల్ సాంగ్ అని తెలుస్తోంది. ఫార్ములా సాంప్రదాయ కథలను ఎప్పుడో దూరం పెట్టిన కమల్, పాటలను కూడా తగ్గిస్తూ పోవడం విశేషమే! షూటింగ్ మొదలైన రోజే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు విపరీతమైన స్పందన రాగా, త్వరలోనే ఓ టీజర్‌ను కూడా విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది. త్రిష హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను కమల్ స్వయంగా నిర్మిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు.

Exit mobile version