
తెలుగు సినీ పరిశ్రమకు ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’ లాంటి పలు ఆణిముత్యాల్లాంటి సినిమాలను అందించిన సింగీతం శ్రీనివాసరావు, ఎనభై ఏళ్ళు దాటినా అదే ఉత్సాహంతో దర్శకత్వం వహిస్తూ ఈతరం దర్శకులకు ఆదర్శంగా నిలిచారు. ఈమధ్యే ‘వెల్కమ్ ఒబామా’ అనే సరికొత్త కథాంశంతో మనముందుకొచ్చిన సింగీతం, తాజాగా కమల్ హాసన్‌తో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారట.
గతంలో కమల్, సింగీతం కాంబినేషన్లో ‘అపూర్వ సోదరులు’, ‘పుష్పక విమానం’, ‘మైఖేక్ మదన కామరాజు’ లాంటి సూపర్‌హిట్ సినిమాలు రూపొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబినేషన్ మళ్ళీ తెరపైకి రావడం ఆసక్తికరంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కమల్ హాసన్ ‘చీకటి రాజ్యం’ అనే తెలుగు, తమిళ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తైన వెంటనే సింగీతం సినిమా పట్టాలెక్కనుందని సమాచారం. ఇక కమల్ తాజా చిత్రం ‘పాపనాశం’ గత శుక్రవారం విడుదలై హిట్ దిశగా దూసుకెళుతోంది.