దసరా రేసులోకి వచ్చి చేరిన ‘కంచె’!

Kanche
‘కంచె’.. ఇండియన్ సినిమాలో రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో వస్తోన్న మొట్ట మొదటి సినిమా. విలక్షణ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ బ్రాండ్‌ను సెట్ చేసుకున్న క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా దీపావళి సీజన్‌‌ను టార్గెట్ చేస్తూ నవంబర్ 6న విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. కాగా ఈ దసరాకు భారీ ఎత్తున విడుదలవుతుందనుకున్న ‘అఖిల్’ సినిమా చివరి నిమిషంలో కొన్ని సాంకేతిక కారణాలతో వాయిదా పడడంతో ‘కంచె’ సినిమా అనూహ్యంగా దసరా రేసులోకి వచ్చి చేరింది. అక్టోబర్ 22న ఈ సినిమాను పెద్ద ఎత్తున విడుదల చేయనున్నట్లు ‘కంచె’ టీమ్ ప్రకటించింది.

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని రిలీజ్‌కి రెడీగా ఉంది. అయితే వరుసగా దసరా సీజన్ ఇతర సినిమాలతో సిద్ధంగా ఉండడంతో ఇప్పటివరకూ ‘కంచె’ సినిమా నవంబర్‌కు ఫిక్స్ అయింది. ఇప్పుడు అఖిల్ సినిమా దసరా సీజన్ నుంచి తప్పుకోవడంతో కంచెకు లైన్ క్లియర్ అయింది. టీజర్, ట్రైలర్, పోస్టర్స్‌తో విపరీతమైన క్రేజ్‌ను మూటగట్టుకున్న ఈ సినిమాపై అంతటా భారీ అంచనాలే ఉండడంతో దసరా సీజన్‌లో సినిమా విడుదల కానుండడం నిర్మాతలకు మంచి అడ్వాంటేజీగానే చెప్పుకోవచ్చు. వరుణ్ తేజ్ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా చిరంతన్ భట్ సంగీతం సమకూర్చారు.

Exit mobile version