
‘కంచె’.. ఆగష్టు 15న విడుదలైన టీజర్‌తో ఒకేసారి అందరి దృష్టినీ ఆకర్షించిన సినిమా. మెగా ఫ్యామిలీ నుంచి కొత్తగా లాంచ్ అయిన హీరో వరుణ్ తేజ్, విలక్షణ దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాపై టీజర్ రిలీజ్ తర్వాత అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయ్. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ ఇలా బలమైన కాన్సెప్ట్‌ను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళాలని తపించే క్రిష్, ‘కంచె’ సినిమాను కూడా అదే కోవలో అందరూ ఆశ్చర్యపోయాలా రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కించారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజున కంచె ట్రైలర్‌ను విడుదల చేసేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్‌డే కాగా, అంతకు ముందు రోజు (సెప్టెంబర్ 1) రాత్రే ‘కంచె’ ట్రైలర్ విడుదల కానున్నట్లు సినిమా యూనిట్ తెలిపింది. టీజర్‌తో విజువల్స్ పరంగా సూపర్ అనిపించుకున్న ఈ సినిమా, ట్రైలర్‌తో ఇంకెంట ఆకట్టుకుంటుందోనని అప్పుడే అంచనాలు మొదలయ్యాయ్. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించారు.