మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్, విలక్షణ సినిమాల దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో ‘కంచె’ పేరుతో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక బలమైన ఎమోషన్‌ను చూపించే క్రిష్, ‘కంచె’ సినిమాను రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో నడిచే ఓ ప్రేమకథకు ముడిపెట్టి తెరకెక్కించారు. ఇక సెప్టెంబర్ 12న ఈ సినిమా ఆడియో రిలీజ్‌ను ప్లాన్ చేసినా, తాజాగా ఈ రిలీజ్‌ను సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేశారు. ఇక ఓ ప్రత్యేక కారణాన్ని దృష్టిలో పెట్టుకొని కంచె ఆడియోను విశాఖపట్నంలో నిర్వహించనుండడం విశేషం.
రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌కు చెందిన పలు యుద్ధ విమానాలు వైజాగ్ పరిసర ప్రాంతాలపై కూడా దాడి జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైజాగ్‌లో సినిమా కథకు తగిన నేపథ్యాన్ని ప్రతిబింబించేలా ఆడియో రిలీజ్‌ను ప్లాన్ చేశారు. సెప్టెంబర్ 17న పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో పోర్ట్ స్టేడియంలో పెద్ద ఎత్తున కంచె ఆడియో రిలీజ్ జరగనుంది. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతా ఫిదా అయిపోయారు. పలువురు స్టార్ హీరోలు సైతం ఈ ట్రైలర్‌ను కొనియాడారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డి నిర్మించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే!
