దర్శకుడిగా మారిన హీరో కార్తికేయ.. బర్త్‌డే స్పెషల్‌గా ‘కమ్‌బ్యాక్’ గ్లింప్స్ రిలీజ్

‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో బలమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. హీరోగానే కాకుండా ‘నానీస్ గ్యాంగ్ లీడర్’, అజిత్ ‘వలిమై’ వంటి చిత్రాల్లో విలనిజంతోనూ మెప్పించిన ఆయన, కథానాయకుడిగా రెండేళ్ల విరామం తర్వాత సరికొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ‘కమ్‌బ్యాక్’ (Comeback) అనే చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఈ చిత్రంతో కార్తికేయ గుమ్మకొండ సరికొత్త అవతారమెత్తారు. హీరోగా నటిస్తూనే, తొలిసారి దర్శకుడిగా మెగాఫోన్ పట్టి ఈ సినిమాను స్వయంగా తెరకెక్కిస్తున్నారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆయన సతీమణి లోహితా రెడ్డి నిర్మిస్తున్నారు.

బాక్సర్‌గా పవర్‌ఫుల్ లుక్

చిత్ర ప్రకటన సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ‘బాక్సింగ్ వరల్డ్‌లో తన పేరు వినిపించి మూడేళ్లవుతోంది.. ఇట్ ఫీల్స్ లైక్ సూసైడ్ మిషన్’ అంటూ సాగే ఆసక్తికర వాయిస్ ఓవర్‌తో గ్లింప్స్ మొదలవుతుంది. ఇందులో కార్తికేయ స్కిప్పింగ్, బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఎంతో ఫిట్‌గా కనిపించారు. విజయ్ బుల్గానిన్ అందించిన నేపథ్య సంగీతం గ్లింప్స్‌ను మరింత ఎలివేట్ చేసింది.

ఈ చిత్రానికి సరస్వతి శుక్లా సమర్పకురాలిగా వ్యవహరిస్తుండగా.. జగదీశ్ చీకటి సినిమాటోగ్రఫీ, కళ్యాణ్ సూర్యప్రకాష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్‌గా సూర్య ఆకెళ్ళ పనిచేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version