మహానటి చిత్రం తరువాత కీర్తి సురేష్ పట్ల దర్శక నిర్మాతల దృష్టి కోణం మారిపోయింది. నటనకు ప్రాధాన్యం ఉన్న మరియు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆమె మొదటి ఛాయిస్ గా కనిపిస్తుంది. అందుకే కొందరు దర్శకులు ఆమె ను దృష్టిలో పెట్టుకొని కొన్ని చిత్రాలు రాస్తున్నారు. నేడు కీర్తి సురేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆమె నటిస్తున్న తాజా చిత్రంలోని లుక్ విడుదల చేశారు. చేతులకు కడియాలు, మేడలో తాయత్తు, నోస్ రింగ్, వైవిధ్యమైన వస్త్ర ధారణలో ఉన్న కీర్తి లుక్ ఆకట్టుకునేలా ఉంది. బంజారా అమ్మాయిగా డీ గ్లామర్ రోల్ చేస్తుందని ఆ లుక్ చూస్తే అర్థం అవుతుంది.
ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ మూవీని దర్శకుడు నగేష్ కుకునూర్ తెరకెక్కిస్తుండగా, చంద్ర పదిరి నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో వస్తున్న ఈ చిత్రంలో హీరో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రలు చేస్తున్నారు. ఇక మహేష్ కోనేరు నిర్మాతగా దర్శకుడు నరేంద్ర నాథ్ తెరకెక్కిస్తున్న మిస్ ఇండియా చిత్రంతో పాటు, తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాతగా తెరకెక్కుతున్న మరో చిత్రంలో కూడా కీర్తి సురేష్ నటిస్తున్నారు.



