ఈ ఏడాది ఆరంభంలో ‘డిస్కో రాజ’తో పలకరించిన రవితేజ చేస్తున్న కొత్త చిత్రం ‘క్రాక్’. గోపిచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లాక్ డౌన్ ముందే సగం షూటింగ్ పూర్తికాగా ఈమధ్యే తిరిగి చిత్రీకరణ స్టార్ట్ చేసి మిగిలిన భాగాన్ని ముగించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని జనవరి 14న సంక్రాతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. మాస్ మహారాజ అభిమానులు
ఈలోపు ట్రైలర్ రిలీజ్ అయితే చూడాలని ఆశగా ఉన్నారు.
వారి కోసం ‘క్రాక్’ టీమ్ స్పెషల్ ప్లానింగ్ చేసింది. సినిమా ట్రైలర్ ను నూతన సంవత్సరం కానుకగా జనవరి 1వ తేదీన విడుదలచేయాలని నిర్ణయించారు. ఈ సినిమా మీద రవితేజ చాలా నమ్మకంగా ఉన్నారు. పోలీస్ పాత్రలో మరోసారి అదరగొట్టి హిట్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో శృతిహాసన్ హీరోయిన్గా నటించగా సముథిరఖని, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. రవితేజ, గోపిచంద్ మలినేనిల కలయికలో ‘బలుపు, డాన్ శీను’ లాంటి మాస్ ఎంటెర్టైనర్లు వచ్చి ఉండటంతో ఈసారి కూడా అలాంటి సినిమానే ఆశిస్తున్నారు ప్రేక్షకులు. ఇకపోతే రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా చేస్తున్నారు.
