కన్నడ హీరో యాష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ‘కెజిఎఫ్’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిన సంగతే. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళంలో భారీ వసూళ్లను సాధించిందీ చిత్రం. ప్రస్తుతం దీనికి కొనసాగింపుగా ‘కెజిఎఫ్ 2’ను తెరకెక్కిస్తున్నారు. దగ్గర దగ్గర 90 శాతం షూటింగ్ ముగిసింది. ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్లోనే జరుగుతోంది. ఈరోజే క్లైమాక్స్ చిత్రీకరణను స్టార్ట్ చేశారు ప్రశాంత్ నీల్. ఇందులో రాఖీ, అధీరాల నడుమ భారీ ఫైట్ సీన్ షూట్ చేస్తున్నారు.
ఈ పోరాట సన్నివేశాన్ని ప్రముఖ స్టంట్ కొరియోగ్రఫర్లు అన్బుమణి, అరివుమణిలు డిజైన్ చేశారు. భారీ సంఖ్యలో తుపాకులు, భీకరమైన ఫైటర్లతో కెజిఎఫ్ 2 సెట్ మొత్తం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోందట. సినిమాలోని ఆఖరి ఫైట్ కావడంతో దీనికోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు. ఇకపోతే ఈ సినిమా టీజర్ జనవరి 8న హీరో యష్ పుట్టినరోజు సందర్బంగా విడుదలకానుంది. సినిమా నుండి అప్డేట్ వచ్చి చాలాకాలం కావడంతో ఈ టీజర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రానున్న వేసవికి సినిమా తప్పకుండా విడుదలయ్యేలానే ఉంది. మొదటి పార్ట్ విపరీతంగా అలరించడంతో యాక్షన్ ప్రియులంతా పార్ట్ 2 మీద విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు.
https://twitter.com/prashanth_neel/status/1335827495463968768
