టాలీవుడ్ విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తన తదుపరి చిత్రం గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారు. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన ‘ఘాటీ’ చిత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో, తర్వాతి సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఏడుగురు హీరోయిన్లతో ఒక ట్రెకింగ్ అడ్వెంచర్ మూవీని క్రిష్ ప్లాన్ చేస్తున్నారంటూ ప్రచారం జరిగింది.
ఈ వార్తలపై క్రిష్ క్లారిటీ ఇస్తూ.. “ఏడుగురు హీరోయిన్లు, ట్రెకింగ్ అడ్వెంచర్ అనేది మంచి ఐడియానే కానీ, అది నిజం కాదు” అని తేల్చి చెప్పారు. ఇదంతా సోషల్ మీడియా సృష్టించిన కథేనని, తన తదుపరి ప్రాజెక్ట్ గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం క్రిష్ కొన్ని కొత్త కథలపై కసరత్తు చేస్తున్నారు.
మరోవైపు, నందమూరి బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ఆదిత్య 999’ సీక్వెల్‌కు క్రిష్ దర్శకత్వం వహిస్తారని భావించినా, ఆయన ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిన్న విరామం తీసుకున్న ఈ సెన్సిబుల్ డైరెక్టర్, తన తర్వాతి చిత్రాన్ని ఎవరితో చేస్తారో చూడాలి.
