
‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందేజగద్గురుమ్’ ఇలా తాను తీసే ప్రతీ సినిమాలోనూ ఏదో ఒక బలమైన కాన్సెప్ట్‌ను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళాలని తపించే దర్శకుడు క్రిష్. తాజాగా ఆయన వరుణ్ తేజ్ హీరోగా రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యానికి ఒక ప్రేమకథను ముడిపెట్టి ‘కంచె’ పేరుతో ఓ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా, అక్టోబర్ 2న పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ట్రైలర్, కాన్సెప్ట్‌తో అందరినీ కట్టిపడేసిన ఈ సినిమా, పై భారీ అంచనాలే ఉన్నాయి.
సెప్టెంబర్ 17న ఈ సినిమా ఆడియో రిలీజ్‌ను ప్లాన్ చేశారు. ఇక ఆడియో రిలీజ్ ప్లాన్స్, సినిమా విశేషాలు తెలియజేస్తూ దర్శకుడు క్రిష్.. కంచె కథ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. వైజాగ్‌లోని ఓ మ్యూజియంలో రెండో ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో వైజాగ్‌పై కూడా ఒక దాడి జరిగిందని, ఆ వివరాలను చూసినప్పుడు కొత్తగా అనిపించిందని తెలిపారు. మళ్ళీ ఒకసారి తమిళ వేదం రీమేక్ షూటింగ్ అప్పుడు కరైకుడిలోని ఓ మ్యూజియమ్ ద్వారా రెండో ప్రపంచ యుద్ధంలో మన సైనికులు కూడా పాలు పంచుకున్న విషయం తనకు మరింత కొత్తగా కనిపించిందని, ఈ నేపథ్యానికి ఓ ప్రేమకథను జోడించి తాను ఈ సినిమా చేశానని క్రిష్ స్పష్టం చేశారు.