చెన్నై నగరాన్ని గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తోన్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో కురిసిన వర్షాలు చెన్నై నగరాన్ని అస్థవ్యస్థం చేసేశాయి. అక్కడి జనజీవనం పూర్తిగా స్థంబించిన నేపథ్యంలో వారికి అండగా నిలబడుతూ తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు టాప్ స్టార్స్ భారీ ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ స్టార్స్ జాబితాలో ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్ అయిన రాఘవ లారెన్స్ కూడా చేరిపోయారు.
కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మొదలుపెట్టి దర్శకులుగా మారిన లారెన్స్, సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటూ ఆదర్శంగా నిలుస్తూ ఉంటారన్న విషయం తెలిసిందే. ఈ మధ్యే అబ్దుల్ కలాం జయంతిన కోటి రూపాయలు విరాళమిచ్చిన ఆయన, తాజాగా చెన్నై వరద బాధితులకు అండగా నిలబడుతూ కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. చెన్నై నగరాన్ని ఇలా చూస్తున్నందుకు బాధగా ఉందని తెలుపుతూ ఆయన ఇంత మొత్తాన్ని విరాళంగా ప్రకటించడాన్ని విశేషంగా చెప్పుకోవచ్చు.
