నందమూరి బాలకృష్ణ 2014లో రెండు భారీ విజయాలను అందుకున్నాడు. అందులో ఒకటి హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఏమ్పికవ్వడం, మరొకటి లెజెండ్ సినిమాతో తన అభిమానులను మెప్పించి, ఓ భారీ విజయాన్ని అందుకోవడం. ఈ సినిమా మార్చిలో విడుదలై విజయవంతంగా ప్రదర్శించడమే కాకుండా 50 కోట్ల క్లబ్ లో కూడా చేరడం విశేషం.
ఈ మధ్య 100 రోజులు ఆడడమే కష్టం అవుతున్న టైంలో లెజెండ్ సినిమా 2 థియేటర్స్ లో 275 రోజులు ప్రదర్శించబడుతోంది. కడప జిల్లా ప్రొద్దుటూరు అర్చన థియేటర్ లో ఈ రోజు అభిమానులు ఘనంగా లెజెండ్ 275 రోజుల వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకకి ఈ చిత్ర టీం అంతా హైదరాబాద్ నుంచి బస్సులో బయలు దేరి ప్రొద్దుటూరు వెళ్తున్నారు. అందులో భాగంగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను, అనిల్ సుంకర, చలపతి రావు తదితర బృందం అంతా కలిసి 275 రోజుల విజయయాత్రని మొదలు పెట్టారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రొద్దుటూరులో ఈ విజయోత్సవ వేడుక జరగనుంది.


