
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సృష్టించిన అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. సినిమా అనే పదాన్నే ఓ ప్రయోగంగా మార్చేసి అద్భుతాలు సృష్టించారాయన. ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’, ‘విచిత్ర సోదరులు’, ‘పుష్పక విమానం’ ఇలా పలు ఆణిముత్యాల్లాంటి సినిమాలను అందించిన సింగీతం శ్రీనివాసరావు, ఎనభై ఏళ్ళు దాటినా అదే ఉత్సాహంతో దర్శకత్వం వహిస్తూ ఈతరం దర్శకులకు ఆదర్శంగా నిలిచారు. ఇక ఈ మధ్యే విడుదలై అంతటా సంచలనం సృష్టిస్తున్న బాహుబలి సినిమాపై ఆయన తనదైన స్టైల్లో ప్రశంసలు కురిపించారు.
“టీవీల్లో వచ్చే ప్రకటనల్లో కొన్ని ప్రమాదకర స్టంట్స్ వచ్చేపుడు, ‘నిపుణుల పర్యవేక్షణలో రూపొందించిన స్టంట్స్ ఇవి. దయచేసి ఇలాంటి స్టంట్స్‌ను అనుకరించేందుకు ప్రయత్నించకండి’ అంటూ ఒక గమనిక వస్తుంది. బాహుబలి సినిమా చూశాక నాకూ ఈ గమనిక లాంటి అనుభూతే కలిగింది. ‘బాహుబలి సినిమా దేశంలో ప్రఖ్యాతిగాంచిన టెక్నీషియన్స్, ఒక విజన్ ఉన్న దర్శకుడి పర్యవేక్షణలో రూపొందిన సినిమా. ఇలాంటివి మనం అనుకరించే ఆలోచనే చేయకూడదు’ అని నాకు నేను చెప్పుకున్నా” అంటూ బాహుబలిపై సింగీతం ప్రశంసలు కురిపించారు.
సినీ పరిశ్రమ సాంకేతికంగా అంతంతమాత్రంగానే అభివృద్ధి చెంది ఉన్న కాలంలోనే అద్భుతాలు సృష్టించిన దర్శకుడు సింగీతం దగ్గరనుండి బాహుబలి టీమ్‌కు వచ్చిన కాంప్లిమెంట్ నిజంగా విలువైనదే! రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి జూలై 10న ప్రపంచవ్యాప్తంగా నాలుగు ప్రధాన భాషల్లో విడుదలై ఇటు బాక్సాఫీస్ పరంగా, అటు ప్రముఖుల ప్రశంసల పరంగా దుమ్మురేపుతోన్న విషయం తెలిసిందే!

