
‘ఏ మాయ చేశావే’ సినిమాతో ఓ అందమైన ప్రేమకథను మనకు అందించిన గౌతమ్ మీనన్ – నాగ చైతన్యల కాంబినేషన్‌లో ప్రస్తుతం ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. కోన వెంకట్ ఈ సినిమాకు మాటలు అందించడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 60% పైనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళినప్పటినుంచే మంచి ఆసక్తి రేకెత్తిస్తూ వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోన్న ఈ సినిమా తమిళ వర్షన్‌లో శింబు హీరోగా నటిస్తున్నారు.
గౌతమ్ మీనన్ మార్క్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు ఓ ఆసక్తికర టైటిల్ పరిశీలనలో ఉంది. ‘సాహసమే శ్వాసగా సాగిపో..’ అనే టైటిల్‌ను ప్రస్తుతం సినిమా యూనిట్ పరిశీలిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ హిట్ ‘ఒక్కడు’లోని పాటను నాగ చైతన్య సినిమాకు పరిశీలిస్తుండడం విశేషంగా కనిపిస్తోంది. ఇక ఈ మధ్యే తెలుగులో పెద్ద పెద్దవైన అచ్చ తెలుగు టైటిల్స్, పాపులర్ సినిమా పాటల్లోని లిరిక్స్‌ను ఎంపిక చేస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడీ కోవలో మరోసినిమా వచ్చే అవకాశం కనిపించడం ఆసక్తికర అంశం. ఈ సినిమాలో తెలుగు, తమిళం రెండు వర్షన్స్‌లోనూ మంజిమా మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.