
దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ‘బాహుబలి’. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున నిన్న విడుదలైన ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచీ అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. గత కొన్ని దశాబ్దాల కాలంలో ఈ స్థాయి అంచనాల మధ్య వేరే ఏ ఇతర సినిమా విడుదల కాని నేపథ్యంలో ‘బాహుబలి’ మొదటి రోజు కలెక్షన్లను కుమ్మేసింది. దేశవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లను కొల్లగొట్టిన సినిమాగా నిలిచి బాహుబలి సత్తా చాటింది. అయితే మళయాలంలో మాత్రం ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విడుదలకు నోచుకోలేదు.
మళయాలంలో ఈ మధ్యే విడుదలై బ్లాక్బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ‘ప్రేమమ్’ సినిమా పైరసీ బారిన పడగా, ఆ సినిమాకు అండగా నిలవాలన్న ఆలోచనలో కేరళ ఎగ్జిబిటర్స్ ఫెడరేషన్ వారు నిన్న థియేటర్ల బంద్ పాటించారు. దీంతో కేరళలోని ప్రధాన థియేటర్లలో నిన్న బాహుబలి విడుదల కాలేకపోయింది. తాజాగా నేడు ఫెడరేషన్ ప్రతినిధులు బంద్ విరమించడంతో నిన్న కేవలం 60 థియేటర్లలో మాత్రమే విడుదలైన సినిమా నేడు దాదాపుగా 140 థియేటర్లలో ప్రదర్శితం కానుంది.