లాక్ డౌన్ రివ్యూ: భూతియా గిరి3-హిందీ వెబ్ సిరీస్(ఎమ్ ఎక్స్ ప్లేయర్)

నటీనటులు: సుమీత్ వ్యాస్, రిత్విక్ జోషి, ఓంకర్ కులకర్ణి

దర్శకుడు: ప్రణవ్ భాసిన్

నిర్మాతలు : టీవీఎఫ్ ఫిల్మ్స్ / ఎంఎక్స్ ప్లేయర్

సంగీతం: ఆకాష్ ముఖర్జీ

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు హిందీ హారర్ సిరీస్ ని ఇచ్చుకోవడం జరిగింది. ఎమ్ ఎక్స్ ప్లేయర్ లో అందుబాటులో ఉన్న భూతియా గిరి3 హారర్ డ్రామా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…

 

కథాంశం ఏమిటీ?

టాప్ కంపెనీ సీఈఓ అయినా దిల్వార్ రానా(సుమీత్ వ్యాస్) జైలునుండి తన కంపెనీ కార్యక్రమాలు చక్కబెడుతూ ఉంటాడు. ఐతే దిల్వార్ రానాను దెయ్యాలు తిరిగే ఓ పెద్ద హోటల్ నడపాల్సిన కండిషన్ పై కొందరు జైలు నుండి బయటకు తీసుకువస్తారు. దెయ్యాలు తిరిగే ఆ హోటల్ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తీసుకున్న దిల్వార్ రానా, ఆ హోటల్ తో చిన్ననాటి బంధం కలిగి ఉంటాడు. మరి శపించ బడిన ఆ హోటల్ దిల్వార్ రానా ఎలా నడిపాడు అనేది మిగతా కథ..

 

ఏమి బాగుంది?

ఆరంభ ఎపిసోడ్స్ తో పాటు, దెయ్యాలు తిరిగే హోటల్ ని నడపడం అనే కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ప్రధాన పాత్ర చేసిన సుమీత్ వ్యాస్ పాత్రకు న్యాయం చేశారు. ఇక సపోర్టింగ్ క్యాస్ట్ కూడా మంచి నటన కనబరిచారు.

కథలో అంతర్లీనంగా వచ్చే కామెడీ బాగుంది. బీజీఎమ్ అలరిస్తుంది. అలాగే నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

ఏమి బాగోలేదు?

ప్రారంభ ఎపిసోడ్స్ ఓ కొత్త తరహా హారర్ సిరీస్ చూడబోతున్నాం అన్న ఆలోచన రేకెత్తిస్తుంది. ఐతే ఎపిసోడ్స్ గడిచే కొద్దీ ఇది ఒక రొటీన్ ఫ్యామిలీ డ్రామాలా మారిపోయింది. హారర్ డ్రామా కాస్తా అంచనాలకు అందుతూ ఆసక్తిలేకుండా సాగుతుంది. రాబోయే సన్నివేశం ఏమిటనేది ప్రేక్షకుడి తెలిసిపోతుంటే ఎటువంటి అనుభూతి కలగదు. ఇక లాజిక్ లేని సిల్లీ సన్నివేశాలు చాలానే ఈ సిరీస్ లో ఉన్నాయి.

ఇక ఈ సిరీస్ బిగ్గెస్ట్ డ్రా బ్యాక్ స్క్రీన్ ప్లే. మలుపులు లేని కథనం బోరింగ్ గా సాగుతుంది. ఇక అప్పుడప్పుడు వచ్చిపోయే హారర్ సన్నివేశాలు ఏమాత్రం ఉత్కంఠ, భయం కలిగించలేకపోయాయి.

 

చివరి మాటగా

మొత్తంగా చెప్పాలంటే భూతియాగిరి 3 ఆ ప్రారంభ ఎపిసోడ్స్ మినహాయించి ఏ దశలో ప్రేక్షకుడిని ఆకట్టుకోలేకపోయింది . బలహీనమైన కథనంలో వచ్చే సన్నివేశాలు ముందుగా తెలిసిపోతుంటే మంచి అనుభూతి కలగదు. ఏమాత్రం ఉత్కంఠ, భయం ఈ హారర్ సిరీస్ కలిగించలేదు.

Rating: 2/5

సంబంధిత సమాచారం :

More