నటీనటులు : రియా సేన్, ఆనంద్ విధాట్, విన్నీ అరోరా
దర్శకత్వం: నిషీత్ నీరవ్ నీల్కాంత్
నిర్మించినవారు: టు నైస్ మెన్
సంగీతం: సరిత్ శేఖర్ ఛటర్జీ మరియు కరణ్ సాంచల
నేటి లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా కామెడీ అండ్ రొమాంటిక్ హిందీ వెబ్ సిరీస్ పతి పత్ని ఔర్ వాహ్ ని ఎంచుకోవడం జరిగింది. ఎమ్ ఎక్స్ ప్లేయర్ లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…
కథాంశం ఏమిటి?
బెనారస్ ప్రాంతానికి చెందిన మోహన్ (అనంత్ విధాత్) భార్య సురభి(విన్నీ అరోరా) అకాల మరణం చెందుతుంది. భర్తపై ప్రేమ కలిగిన సురభి ఆత్మ మోహన్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఆమె కోరిక మేరకు రెండో పెళ్లి చేసుకోవాలని మోహన్ సిద్ధం అవుతాడు. ముఖం కూడా చూసుకోకుండా రిమ్ జిమ్(రియా సేన్) ని పెళ్లి చేసుకున్న మోహన్ ఫస్ట్ నైట్ రోజు ఆమె అందాన్ని చూసి మైమరిచిపోతాడు. ఐతే ఆత్మగా ఉన్న సురభి ఆమెను చూసి ఈర్ష్య పడుతుంది. ఆత్మ రూపంలో మోహన్, రిమ్ జిమ్ దాంపత్య జీవితానికి అడ్డుపడుతుంది. మరి ఈ ముగ్గురి మధ్య రొమాంటిక్ డ్రామా ఎలా ముగిసింది అనేది మిగతా కథ..
ఏమి బాగుంది?
సల్మాన్ ఖాన్ యాక్షన్ ఎంటర్టైనర్ సుల్తాన్ చిత్రంలో ప్రాధాన్యం ఉన్న రోల్ చేసిన అనంత్ విధాత్ ఇద్దరు భార్యల మధ్య నలిగిపోయే భర్త పాత్రలో మెప్పించారు. అతని ఇన్నోసెంట్ మరియు రొమాంటిక్ యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. చనిపోయిన ఆత్మగా మారి ఈర్ష్యతో భర్తను విసిగించే భార్య పాత్రలో నటి విన్నీ అరోరా బాగా చేశారు. ఐతే ఈ వెబ్ సిరీస్ లో అందరినీ ఆకట్టుకొనే పాత్ర మాత్రం రిమ్ జిమ్. గ్లామర్ పాత్రలకు పేరున్న రియా సేన్ నటనకు స్కోప్ ఉన్న పాత్రను చక్కగా రక్తి కట్టించింది. అటు గ్లామర్ మరియు యాక్షన్ తో ఆమె మెప్పించింది.
ఇండియాలో భర్తల పట్ల భార్యలకు ఉండే ప్రేమ, దాని వలన ఇతరులు దగ్గరైతే ఓర్చుకోలేని గుణం వంటి విషయాలను చక్కగా చర్చించారు. నిర్మాణ విలువు బాగున్నాయి. డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొన్ని ఎపిసోడ్స్ లో హాస్యం ఆకట్టుకుంది.
ఏమి బాగోలేదు?
మొదటి రెండు ఎపిసోడ్స్ సిరీస్ పై ఆసక్తి రేపగా మూడవ ఎపిసోడ్ నుండి సిరీస్ పట్టు కోల్పోయింది. ఈ సిరీస్ లో పాత్రలు తీరు, వాటి మధ్య ఎమోషనల్ బాండింగ్ కుదరలేదు. ఇక ఆత్మ వంటి విషయాలు నేటి తరానికి ఒంటబట్టని విషయాలు అని చెప్పాలి.
చివరి మాటగా
మొత్తంగా పతి పత్ని ఔర్ వాహ్ అక్కడక్కడా ఆకట్టుకొనే ఫ్యామిలీ డ్రామా అని చెప్పొచ్చు. సిరీస్ ప్రారంభించిన విధానం.. ముగింపు కొంత మేర ఆకట్టుకున్నా మధ్యలో ఎపిసోడ్స్ నిరాశపరిచాయి. విలేజ్ టైప్ కామెడీ ఫ్యామిలీ డ్రామాలను ఇష్టపడే వారికి ఒకింత నచ్చే అవకాశం కలదు.
Rating: 2.5/5