ముగిసిన ‘మా’ ఎన్నికల పోలింగ్!

ముగిసిన ‘మా’ ఎన్నికల పోలింగ్!

Published on Mar 29, 2015 2:30 PM IST

Celebs-at-Maa-Elections-
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటీనటుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)‍లోని కీలక పదవులకు 2015-17 దఫాకు గానూ ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2గంటల వరకు సాగింది. ప్రధానంగా ‘మా’ అధ్యక్ష పదవికి ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్, నటి జయసుధలు పోటీలో ఉన్నారు. మొత్తం 702 మంది సభ్యులు ఓటర్లుగా ఉండగా, కేవలం 394 ఓట్లు మాత్రమే పోలవ్వడం గమనార్హం.

పోటీలో ఉన్న ఇరువర్గాలు ఒకరిపై ఒకరు వాదోపవాదాలు చేసుకోవడం, సవాళ్ళు విసురుకోవడంతో ఈ ఎన్నిక పట్ల సామాన్య ప్రజానీకంలోనూ ఆసక్తి రేగింది. ఈ పరిణామాలతో గత కొన్ని రోజులుగా సినీ రాజకీయం వేడెక్కిన విషయం తెలిసిందే. 1993లో ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఏర్పాటైంది. ప్రస్తుతం ఎంపీ మురళీ మోహన్ ‘మా’కు అధ్యక్షుడిగా ఉన్నారు. రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఆయన మళ్ళీ ఆ పదవిని చేపట్టే ఆలోచనలో లేరు. ఇక ఈ క్రమంలోనే 2015-17 దఫాకు అధ్యక్ష పదవికి కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి.

పోలింగ్ సరళిని పరిశీలిస్తే.. ఉదయం నుంచే సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ భవన్ వద్దకు చేరుకున్నారు. అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న రాజేంద్ర ప్రసాద్, జయసుధలతో పాటు సూపర్ స్టార్ కృష్ణ, నందమూరి బాలకృష్ణ, కృష్ణంరాజు, కోట శ్రీనివాసరావు, నాగబాబు, సుమన్, ప్రకాష్ రాజ్, రోజా తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ‘మా’ ఎన్నికలు ఇప్పటికి ముగిసినా, ఫలితాలు మాత్రం ఇప్పుడే విడుదలయ్యే అవకాశం లేదు. ‘మా’ ఎన్నికల విషయం కోర్టు పరిధిలో ఉన్నందున కోర్టు తదుపరి ఉత్తర్వులు విడుదలయ్యేవరకూ ఫలితాలు వెలువడే పరిస్థితి లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు