శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా నటించిన చిత్రం ‘మా రాముడు అందరివాడు’. యద్దనపూడి మైకిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ పతాకాలపై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న 200కు పైగా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా సీనియర్ నటుడు సుమన్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో తాను ముఖ్యమంత్రి పాత్ర పోషించానని, హీరో శ్రీరామ్ ద్విపాత్రాభినయంలో మెప్పించారని తెలిపారు. మంచి కథ, కథనాలతో వస్తున్న ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.
నిర్మాత అనుముల లక్ష్మణరావు మాట్లాడుతూ.. మారెడుమిల్లి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపామని, తాను ఇందులో ప్రతినాయకుడి పాత్ర కూడా పోషించానని చెప్పారు. సుమన్, తన మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయని వివరించారు.
తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని దర్శకుడు యద్దనపూడి మైకిల్ పేర్కొన్నారు. కంటెంట్ ఆధారంగా చిన్న సినిమాలను కూడా ప్రోత్సహించాలని హీరో శ్రీరామ్ కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వెంకట్ దుగ్గిరెడ్డి, శ్రీనివాస తేజ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
