ఘనంగా ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ టైటిల్ లాంఛ్

Magic Movements

తల్లాడ సాయికృష్ణ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ (మీరు అనుకున్నది కాదు). ప్రముఖ దర్శకుడు కె.దశరథ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, శ్రీ లక్ష్మి శ్రీనివాస ఫిలిమ్స్ బ్యానర్లపై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. వెంకట్ దుగ్గిరెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమా టైటిల్ లాంఛ్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా హీరో, దర్శకుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ… ఇంట్లో ఉన్న సాయిబాబా ఫొటో స్ఫూర్తితో ఈ స్క్రిప్ట్ రాసుకున్నానని తెలిపారు. సినిమా ప్రారంభించే సమయానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, నిర్మాతలు వెంకట్ దుగ్గిరెడ్డి, తల్లాడ శ్రీనివాస్‌లతో పాటు దర్శకుడు దశరథ్ అండగా నిలిచారని పేర్కొన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలకు డివోషనల్ టచ్ జోడించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

చిత్ర సమర్పకులు దశరథ్ మాట్లాడుతూ, సాయికృష్ణకు సినిమాపై ఉన్న ప్యాషన్, కథలోని సస్పెన్స్ అంశాలు నచ్చి ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత తల్లాడ వెంకన్న, హీరోయిన్ ఏకాదంతాయ సిరి, డీవోపీ సతీష్ రెడ్డి తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే మిగిలిన షూటింగ్ పూర్తి చేసి సినిమాను విడుదలకు సిద్ధం చేస్తామని చిత్రబృందం తెలిపింది.

Exit mobile version