
ఏదన్నా పండగ సీజన్ అంటే బాక్స్ ఆఫీసు వద్ద స్టార్ హీరోల రెండు మూడు సినిమాలు ఒకేసారి రిలీజ్ కావడం కామన్ గా జరిగే విషయమే.. ఈ విషయంలో గత రెండు సంవత్సరాలుగా మహేష్ బాబు – రామ్ చరణ్ లు ఒకరితో ఒకరు డీ కొడుతూనే ఉన్నారు. 2013 సంక్రాంతి బరిలో మహేష్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ – చరణ్ ‘నాయక్’ లు విడుదలైతే, 2014 సంక్రాతి బరిలో కూడా మహేష్ ‘1-నేనొక్కడినే’ తో, చరణ్ ‘ఎవడు’ తో బాక్స్ ఆఫీసు వద్ద పోటీ పడ్డారు.
మాకు అందిన సమాచారం ప్రకారం వీరిద్దరూ మూడోసారి బాక్స్ ఆఫీసు వద్ద డీ కొట్టుకోవడానికి సిద్దమవుతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘ఆగడు’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే రామ్ చరణ్ నటిస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ రెండు సినిమాలను సెప్టెంబర్ 26న రిలీజ్ చేయడానికి ప్రొడక్షన్ టీమ్స్ ప్లాన్ చేస్తున్నాయని సమాచారం.
‘ఆగడు’ హిట్ కాంబినేషన్(మహేష్ బాబు + శ్రీను వైట్ల + 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్) లోవస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా న్యూ కాంబినేషన్(రామ్ చరణ్ + కృష్ణవంశీ + బండ్ల గణేష్) కావడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అనుకుంటున్నట్టుగానీ ఈ సినిమాలు రెండూ ఒకేసారి వస్తే ఏ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటుందో చూడాలి.

