సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నాటికి పూర్తి కానుండగా, దీనిని పాన్-ఇండియా మరియు అంతర్జాతీయ స్థాయిలో భారీగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు నెక్స్ట్ చిత్రం ఏంటనేది ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం మహేష్ బాబుకు మైత్రీ మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థల నుండి భారీ ఆఫర్లు మరియు అడ్వాన్స్‌లు వస్తున్నప్పటికీ, ఆయన ఏ ప్రాజెక్ట్‌కూ సైన్ చేయలేదు. ‘వారణాసి’ చిత్రం సాధించబోయే క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఆయన కేవలం పాన్-ఇండియా స్థాయికే పరిమితం కాకుండా అంతకుమించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. టాప్ డైరెక్టర్స్ అందరూ బిజీగా ఉండటం కూడా దీనికి ఒక కారణం.
రాజమౌళి సినిమా తర్వాత నటుల ఆలోచనలు అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి. ‘వారణాసి’ చిత్రానికి గ్లోబల్ స్టూడియోల సపోర్ట్ ఉండటంతో, మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం నమ్రతతో కలిసి ఓ కార్పొరేట్ దిగ్గజంతో చర్చలు జరుపుతున్నట్లు టాక్. అయితే ‘వారణాసి’ విడుదల వరకు మహేష్ ఖాళీగా ఉంటాడా లేదా ఈ లోపు ఏదైనా చిన్న సినిమా పూర్తి చేస్తారా అనే దానిపై 2026 చివరి నాటికి క్లారిటీ రానుంది.


