
సూపర్ స్టార్ మహేష్ బాబుకు గత ఏడాది అంతగా కలసిరాలేదు. 2014లో ఈ రాజకుమారుడు నటించిన రెండు సినిమాలు ‘1 నేనొక్కడినే’, ‘ఆగడు’ విడుదలయ్యాయి. ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైన ఈ సినిమాలు ఆశించిన విజయం సాధించలేదు. అందుకే ఈ ఏడాది దూకుడు చూపించడానికి మహేష్ రెడీ అయ్యాడని ఫిల్మ్ నగర్ టాక్.
2015లో మొత్తం మీద మూడు సినిమాలను విడుదల చెయ్యాలని డిసైడ్ అయ్యాడట ఈ సూపర్ స్టార్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. వేసవికి ఈ సినిమాను విడుదల చేయాలనీ ప్లాన్ చేశారు. షూటింగ్ మాత్రం ముందే కంప్లీట్ అవుతుంది. వెంటనే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ చేయడానికి అంగీకరించారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తారని ఫిల్మ్ నగర్ సమాచారం. పూరి ఎంత స్పీడుగా సినిమా తీసి పెడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మూడు సినిమాలు 2015లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మహేష్ బాబు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.
గత ఏడాది నిరాశ పడ్డ అభిమానులు, ఈ సంవత్సరం మూడు సినిమాలతో సూపర్ స్టార్ సక్సెస్ బాటలో దూకుడు చూపిస్తాడని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. హట్రిక్ కొడతాడని చెప్తున్నారు.

