ప్రజెంట్ ఇండస్ట్రీలో కరోనాకు ఎఫెక్ట్ అవుతున్న నటీ నటుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు చిత్రీకరణలు కూడ జరుగుతున్నాయి. తాజాగా రామ్ చరణ్, వరుణ్ తేజ్ లకు కూడ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మరోసారి పరిశ్రమలో కంగారు వాతావరణం నెలకొంది. అందుకే స్టార్లు ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటున్నారు. తమతో పాటు కుటుంబ సభ్యులకు కూడ కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన పిల్లలకు కోవిడ్ పరీక్షలు చేయించారు.
మహేష్ కుమార్తె సితార కోవిడ్ టెస్ట్ చేయించుకుంటున్న వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అంతేకాదు మంచి మెసేజ్ కూడ ఇచ్చింది. కోవిడ్ టెస్ట్ అంటే పెద్ద ప్రాసెస్ అని, నొప్పి, బాధ ఉంటాయనే అభిప్రాయం చాలామంది పిల్లల్లోనే కాక పెద్దల్లో కూడ ఉంది. సితార తాను కూడ మొదట్లో పరీక్షలు చేయించుకోవడానికి వెనుకాడానని, కానీ అమ్మ పక్కనుండటంతో చేయించుకోగలిగానని, నిజం చెప్పాలంటే అదేమంత నొప్పిగా, బాధగా ఉండదని అంటూ తన వయసున్న పిల్లలకు సలహా ఇచ్చింది. అంతేకాదు స్నేహితులను, కుటుంబ సభ్యులను కలుస్తున్నప్పుడు మనం సేఫ్ గా ఉన్నామని నిర్ధారించుకోవాలని, కాబట్టి అందరూ పరీక్షలు చేయించుకుని సురక్షితమైన సమాజాన్ని నిర్మిద్దామని సందేశం కూడ ఇచ్చింది. చిన్న వయసులోనే ఈ స్థాయి సామాజిక స్పృహ కలిగిన సితారను మెచ్చుకోవాల్సిందే మరి. ఇకపోతే పరీక్షల్లో సితారకు నెగెటివ్ రిపోర్ట్స్ వచ్చాయి.
