కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, శృతి హాసన్ జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం పూణేలో జరుగుతోంది. ఈ నెల 9న పూణేలో ప్రారంభమైన ఈ షెడ్యూల్ 15 వరకు జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో మహేష్, శ్రుతిలపై కొన్ని సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరిస్తున్నారు.
నవంబర్ 16న మూవీ యూనిట్ హైదరాబాద్ కు తిరిగి వస్తారు. 16 తర్వాత నుండి సినిమా టాకీ పార్ట్ పూర్తయ్యే వరకూ హైదరాబాద్ లో షూటింగ్ చేస్తారు. అన్నపూర్ణ స్టూడియోస్, రామోజీ ఫిల్మ్ సిటీలలో చిత్రీకరణ జరుపుతారు. పాటల చిత్రీకరణ కోసం విదేశాలు వెళ్తారని సమాచారం.
రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీస్ పతాకంపై యలమంచిలి రవి శంకర్, మోహన్, ఎర్నేని నవీన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు.


