
‘1 నేనొక్కడినే’, ‘ఆగడు’ లాంటి పరాజయాల తర్వాత మహేష్ చేసిన తాజా చిత్రం ‘శ్రీమంతుడు’ బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్స్ కొల్లగొడుతోన్న విషయం తెలిసిందే. ఆగష్టు 7న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైన ఈ సినిమా, సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద రెండో వారం కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మహేష్ ఓ ఊరిని దత్తత తీసుకొని బాగుపరిచే శ్రీమంతుడిగా నటించారు. ఇక తమ సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకుపోవడం పట్ల శ్రీమంతుడు టీమ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఓ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.
శ్రీమంతుడుతో వచ్చిన హిట్‌తో ఫుల్ హ్యాపీగా ఉన్న మహేష్, ఈ మీట్లో అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. ‘శ్రీమంతుడు’తో మీ కెరీర్‌కి ఓ మంచి హిట్ వచ్చింది. ఇక ఆ తర్వాత చేయబోయే బ్రహ్మోత్సవం గురించి ఏం ఆలోచిస్తున్నారు? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. “శ్రీమంతుడుతో రెండు వారాల నుంచి నిద్ర లేదు. ఒక వారం కాస్త టెన్షన్, ఇతర పనులతో నిద్ర లేదు. ఈ వారం సక్సెస్‌తో నిద్ర లేదు. ఇంకా నేను శ్రీమంతుడు సక్సెస్‌ను ఎంజాయ్ చేయలేదు. ముందు సక్సెస్‌ను ఎంజాయ్ చెయ్యనివ్వండి. ఆ తర్వాత బ్రహ్మోత్సవం గురించి ఆలోచిద్దాం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీమంతుడులో కీ రోల్స్ చేసిన రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు తదితరులు పాల్గొన్నారు. మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.

