మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad) బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కేవలం మూడు రోజుల్లోనే రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది.
సంక్రాంతి రోజునే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అనేక కేంద్రాల్లో ఈ చిత్రానికి పూర్తి స్థాయి హౌస్‌ఫుల్స్ నమోదయ్యాయి. షోల సంఖ్యకు, ప్రేక్షకుల డిమాండ్‌కు మధ్య భారీ అంతరం కనిపిస్తోంది. థియేటర్ల సామర్థ్య పరిమితుల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడగా, చిరంజీవి సినిమా ప్రభావంతో ఇతర సంక్రాంతి రిలీజ్‌లకు కొంతమేర లాభం చేకూరుతోంది.
షోల కొరత నేపథ్యంలో వచ్చే కొన్ని రోజుల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఇది మెగాస్టార్ బాక్సాఫీస్‌పై సృష్టిస్తున్న ప్రభావం అని స్పష్టంగా తెలుస్తోంది. సంక్రాంతికి ఒకేసారి ఎక్కువ సినిమాలు విడుదల కావడం వల్ల ఏర్పడిన కెపాసిటీ సమస్యల మధ్య కూడా ‘మన శంకర వరప్రసాద్ గారు’ రూ.300 కోట్ల గ్రాస్ క్లబ్ వైపు వేగంగా దూసుకుపోతోంది. హాలిడే సీజన్ తర్వాత కూడా సినిమా అదే స్థాయిలో నిలబడితే, ఈ వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
