సావిత్రి గారితో నాటి స్మృతులని పంచుకున్న మెగాస్టార్ చిరంజీవి

సావిత్రి గారితో నాటి స్మృతులని పంచుకున్న మెగాస్టార్ చిరంజీవి

Published on Apr 3, 2024 1:00 AM IST

ఒకప్పటి దివంగత దిగ్గజ నటి సావిత్రి గారు తెలుగుతో పాటు తమిళ సహా పలు ఇతర భాషల్లో నటిగా ఎంతో గొప్ప క్రేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆమె మనల్ని విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయినప్పటికీ ఆమె చేసిన సినిమాల, అందులోని పాత్రల రూపంలో ఎప్పుడూ మనతోనే ఉంటారు. విషయం ఏమిటంటే, నేడు జరిగిన సావిత్రి క్లాసిక్స్ పుస్తక లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. సావిత్రి నటించిన కొన్ని క్లాసికల్ సినిమాల విశేషాలను సావిత్రి క్లాసిక్స్ పేరుతో ఆమె కూతురు విజయ చాముండేశ్వరి ఆ పుస్తకాన్ని రాసారు. దానిని చిరంజీవి దంపతుల చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ పునాదిరాళ్లు సినిమాలో సావిత్రిగారితో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

ఆమె ముందు నేను డాన్స్ చేయడం, నేను పైకి వస్తానని ఆమె అభినందించడం నాకు ఇంకా గుర్తుందని అన్నారు. ఆవిడని మొదటి సారి పునాదిరాళ్ళు షూటింగ్ రాజమండ్రి వెళ్లి కలిశాను. ఆవిడను చూడగానే సంతోషంలో మాటలు రాలేదు. నా పేరు అడిగారు, ప్రసాద్ నుండి చిరంజీవి గా పేరు మార్చుకున్న రెండు మూడు రోజుల తర్వాత సందర్భమది. చిరంజీవి అని చెప్పగానే శుభం అన్నారు. తర్వాత ఒకసారి డాన్స్ చేయమని అడిగారు.

ఆ టైం లో నా డాన్స్ చూసి మంచి యాక్టర్ అవుతావ్ అని చెప్పారు. అనంతరం ఒకానొక సందర్భంలో సావిత్రి గారు మీకు తెలుసా ఈ అబ్బాయి చిరంజీవి, డాన్స్ చాలా బాగా వేస్తాడు, డాన్స్ చెయ్యవాయ్ అనగానే అడగటమే ఆలస్యం నేను రెడీ అయిపోతా, నా దగ్గర టేప్ రికార్డర్ ఉంటుంది, అప్పట్లో బోనీ ఎం, అబ్బా అని కొన్ని ఇంగ్లీష్ నంబర్స్ ఉన్నాయ్. అవి ప్లే చేసి డాన్స్ చేశానని అప్పట్లో ఆమెతో గడిపిన పలు మధుర స్మృతులను పంచుకున్నారు మెగాస్టార్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు