ఇంటర్వ్యూ: దర్శకుడు మేర్లపాక గాంధీ – ‘కొరియన్ కనకరాజు’ మంచి ఫన్ ఎంటర్‌టైనర్..!

​మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 7న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు మేర్లపాక గాంధీ మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు.

‘​కొరియన్ కనకరాజు’ కథ ఆలోచన అసలు ఎలా మొదలైంది?

​ఒకసారి అనంతపురం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు కియా ఫ్యాక్టరీ దగ్గర కొరియన్ల ప్రత్యేక కల్చర్ చూసి ఆశ్చర్యపోయాను. అనంతపురాన్ని, కొరియాను కలిపేలా కథ ఉంటే బాగుంటుంది అనుకుని… “ఒక కొరియన్ ఆత్మ అనంతపురం కుర్రాడిని ఆవహిస్తే ఎలా ఉంటుంది?” అనే ఫన్నీ ఆలోచనతో ఈ స్క్రిప్ట్ రాశాను.

​వరుణ్ తేజ్ గారిని ఈ పాత్ర కోసం ఎందుకు ఎంచుకున్నారు?

​ఈ కథలో కనకరాజు పాత్రతో పాటు కొరియన్ పాత్ర షేడ్స్ కూడా ఉంటాయి. వరుణ్ తేజ్ గారి ఫిజిక్, కొత్త ప్రయోగాలు చేసే తత్వం ఈ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సరిపోయాయి. నేను పాయింట్ చెప్పగానే ఆయన బాగా నమ్మి ఇన్వాల్వ్ అయ్యారు.

​వరుణ్ తేజ్ గారు ఈ పాత్ర కోసం ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు?

అనంతపురం యాసతో పాటు కొరియన్ భాష మాట్లాడటం ఆయనకు బిగ్ ఛాలెంజ్. దీనికోసం కొరియన్, అనంతపురం ట్యూటర్ల ద్వారా ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. కొరియన్ డైలాగ్స్ వచ్చినప్పుడు ప్రేక్షకుల కోసం తెలుగు సబ్‌టైటిల్స్ కూడా వేస్తున్నాం.

​హీరోయిన్ రితిక క్యారెక్టర్ గురించి చెప్పండి?

​రితిక ఇందులో కొరియన్ ఫ్యాక్టరీలో పనిచేసే అమ్మాయిగా కనిపిస్తుంది. ఆమె లుక్, బాడీ లాంగ్వేజ్ ఆ కల్చర్‌కు బాగా మ్యాచ్ అయ్యాయి. ఆమెకు కూడా సినిమాలో చాలా కొరియన్ డైలాగ్స్ ఉన్నాయి.

​సినిమాలో కామెడీ వర్కవుట్ అయిన తీరు ఎలా ఉంది?

​ఇది పూర్తిగా ఫన్ ఎంటర్‌టైనర్. సత్య, మురళీధర్ గౌడ్, సునీల్ గార్ల పాత్రలు చాలా ఫన్నీగా ఉంటాయి. హీరోకి కొరియన్ ఆత్మ ఆవహించాక ఆయన కొరియన్‌లో మాట్లాడే సన్నివేశాల నుండి విపరీతమైన నవ్వులు వస్తాయి.

​కొరియాలో షూటింగ్ అనుభవం ఎలా ఉంది?

​అక్కడికి వెళ్లడం, వీసాలు సాధించడం చాలా కష్టమైన ప్రాసెస్. కొరియాలోని ఒక ఐలాండ్‌లో 20 రోజుల పాటు పరిమితమైన క్రూతో తీశాం. అలాగే కొంత భాగాన్ని కజకిస్థాన్‌లో కూడా చిత్రీకరించాం.

​థమన్ గారి సంగీతం గురించి?

​థమన్ గారు అద్భుతమైన పాటలు, ఎక్స్‌ట్రా ఆర్డినరీ రీ-రికార్డింగ్ ఇచ్చారు. ఇప్పటికే వచ్చిన పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

​చివరిగా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు?

​నేను, వరుణ్ తేజ్ గారు చాలా ప్యాషన్‌తో ఈ సినిమా చేశాం. ఖచ్చితంగా థియేటర్లలో ప్రేక్షకులను నవ్వించి, మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుందనే నమ్మకం ఉంది.

Exit mobile version