నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’ ట్రైలర్ ఇటీవల విడుదలై నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ ట్రైలర్‌లో నటీనటుల గెటప్‌లు, ముఖ్యంగా సీతాదేవిగా నటిస్తున్న సాయిపల్లవి, కైకేయి పాత్రలో కనిపిస్తున్న లారా దత్తా కాస్ట్యూమ్స్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సీతాదేవి బ్లౌజ్ డిజైన్, కైకేయి ధరించిన దుస్తుల రంగులపై పలువురు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు చేశారు.
ఈ స్పందనలపై చిత్ర కాస్ట్యూమ్ డిజైనర్లు రింపుల్, హర్‌ప్రీత్ నరులా వివరణ ఇచ్చారు. రామాయణం లాంటి పౌరాణిక కావ్య ఆధారిత చిత్రాన్ని తెరకెక్కిస్తున్నప్పుడు పోలికలు, విమర్శలు రావడం సహజమని, వీటన్నింటికీ తాము ముందే మానసికంగా సిద్ధమయ్యామని వారు పేర్కొన్నారు.
పూజా గదిలోని అమ్మవారి రూపమే ప్రేరణ
సాయిపల్లవి ధరించిన సీతాదేవి కాస్ట్యూమ్‌పై వచ్చిన వ్యాఖ్యలకు డిజైనర్ రింపుల్ స్పందిస్తూ.. “నేను కళ్ళు మూసుకుని సీతాదేవిని తలచుకున్నప్పుడు ఆర్కియోలాజికల్ ప్రామాణికత గురించి ఆలోచించలేదు. మా ఇంట్లోని పూజా గదిలో ఉన్న అమ్మవారి రూపం నా మనసులో ఎలాంటి చిత్రాన్ని ఆవిష్కరించిందో, దాన్నే డిజైన్ చేశాను. అది మేము ఆలోచించి తీసుకున్న స్పష్టమైన నిర్ణయం” అని చెప్పారు.
చారిత్రక పరిశోధన డిజైనింగ్‌కు ప్రాథమిక పునాది అయినప్పటికీ, దాన్ని కళాత్మకంగా ఎలా ఆవిష్కరించామనేదే ముఖ్యమని పేర్కొన్నారు. పూర్వకాలం నాటి దుస్తుల ఆధారాలు స్పష్టంగా లభించవు కాబట్టి.. చిన్ననాటి నుంచి చూసిన క్యాలెండర్ ఆర్ట్, రాజా రవివర్మ వర్ణచిత్రాలు, ఆలయ శిల్పాలను దృష్టిలో ఉంచుకుని ఈ రూపకల్పన చేశామని వివరించారు.
రంగుల వెనుక పాత్రల భావోద్వేగాలు
కైకేయి పాత్రలో లారా దత్తా కాస్ట్యూమ్‌పై వచ్చిన వ్యాఖ్యలపై మరో డిజైనర్ హర్‌ప్రీత్ స్పందించారు. “కైకేయి కాస్ట్యూమ్‌లోని ఆకుపచ్చ రంగు మాతృత్వానికి ప్రతీక కాగా, ముదురు మెరూన్ రంగు ఆమె తీసుకోవాల్సిన కఠిన నిర్ణయాన్ని, దాని వెనుకున్న మానసిక సంఘర్షణను సూచిస్తుంది. సొంత కుమారుడు, రాముడి మధ్య నలిగిపోయే పాత్ర ఆమెది. ప్రతి డిజైన్ వెనుక ఒక ఆలోచన ఉంది. సినిమా చూడక ముందే ఒక ముగింపునకు రావద్దు, థియేటర్‌లో చూశాక మీ అభిప్రాయాన్ని చెప్పండి” అని ఆయన కోరారు.
