ఓటిటి రివ్యూ : “మిస్ మ్యాచ్డ్” – హిందీ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం

నటీనటులు: ప్రజక్త కోలి, రోహిత్ సరఫ్, రణ్విజయ్ సింఘా, విద్యా మలవాడే

దర్శకత్వం: ఆకర్ష్ ఖురానా, నిపున్ ధర్మధికారి

నిర్మాత(లు): రోనీ స్క్రూవాలా

సినిమాటోగ్రఫీ : అవినాష్ అరుణ్, మిలింద్ జోగ్

ఎడిటర్(లు): సన్యుక్త కాజా, నమ్రతా రావ్

పలు ఆసక్తికర ఓటిటి వెబ్ సిరీస్ ల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో నేడు మేము ఎంచుకున్న వెబ్ సిరీస్ “మిస్ మ్యాచ్డ్”.దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ “నెట్ ఫ్లిక్స్”లో అందుబాటులో ఉన్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇపుడు సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఈ సిరీస్ లో ప్రధాన పాత్ర డింపుల్(ప్రజక్తా కోలి) తాను సొంతంగా నిలబడి ఒక యాప్ తయారు చేయాలనుకొనే సాధారణ అమ్మాయితో మొదలవుతుంది. కానీ ఆమె కుటుంబ పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి విభిన్నం. మిడిల్ క్లాస్ కుటుంబం అయిన ఈమె తల్లిదండ్రులు ఆమెకు చదువు ఆపించేసి పెళ్లి చేసేయాలని చూస్తారు. అయితే ఒక సమ్మర్ క్యాంప్ కు డింపుల్ వెళ్లాల్సి వస్తుంది. కానీ ఈ క్యాంపులో నాగరిక జీవితంలో బాగా వేసారిపోయిన వ్యక్తి(రిషి)ని కలుస్తుంది. అక్కడ నుంచి వీరి ప్రయాణం ఎలా కొనసాగింది? చివరికి వీరిద్దరి లైఫ్ స్టోరీ ముగిసింది అన్నది అసలు కథ.

 

ఏమి బాగుంది?

 

హిందీలో సంచలన యూట్యూబ్ స్టార్ అయినటువంటి ప్రజక్తా కోలికి ఇది ఒక డెబ్యూ సిరీస్ కేవలం యూట్యూబ్ తో కొంతమందికి మాత్రమే పరిమితం అయిన ఈమె ఈ సిరీస్ తో మరింత మందికి చేరువయ్యే అవకాశాన్ని తెచ్చుకొంటుంది అని చెప్పాలి. ఆ స్థాయిలో తాను తన రోల్ ను ఇందులో చేసింది.

అసలు తన డెబ్యూలా అని కాకుండా చాలా నాచురల్ గా చేసేసింది. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ లో కూడా మంచి నటనను ఈమె ప్రదర్శించింది. ఇక రోహిత్ సరాఫ్ విషయానికి వస్తే తన లుక్స్ పరంగా డీసెంట్ గా కనిపించి మంచి నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే ప్రజక్తతో కూడా మంచి కెమిస్ట్రీ సీన్స్ లో బాగా చేసాడు.

ఇక అలాగే మిగతా నటీనటులు కూడా తమ నుంచి మంచి అవుట్ పుట్ ను అందించారు. ఇక అలాగే ఈ సిరీస్ లో చూపించిన స్టూడెంట్ లైఫ్ నేపథ్యాన్ని చాలా బాగా ఆవిష్కరించారు. అలాగే నిర్మాణ విలువలు కానీ సినిమాటోగ్రఫీ మరియు కెమెరా వర్క్ అంతా మంచి ఇంప్రెసివ్ గా ఈ సిరీస్ లో అనిపిస్తాయి.

 

ఏమి బాగోలేదు?

 

ఈ సిరీస్ కు ఎంచుకున్న స్టూడెంట్ లైఫ్ అనే నేపథ్యంలో కొత్తదనం లోపిస్తుంది. కానీ దీనికి కాస్త సృజనాత్మకత జోడించడం వల్ల అంత కొత్తగా ట్రై చేసిన ఈ ప్రయత్నం రొటీన్ గానే అనిపిస్తుంది. ముఖ్యంగా అయితే కొన్ని సన్నివేశాలను మేకర్స్ హాలీవుడ్ నుంచి కాపీ కొట్టినట్టు అనిపిస్తుంది.

అలాగే సిరీస్ స్టార్టింగ్ కూడా ఏమంత ఆసక్తికరంగా అనిపించదు. ఉన్న పాత్రలను కూడా ఇంకా బాగా పరిచయం చేసి ఉంటే బాగుండేది. అలాగే మరో నిరాశ కలిగించే అంశం ఏమిటంటే ఈ సిరీస్ ఒకింత నెమ్మదిగానే సాగినట్టు అనిపిస్తుంది. అలాగే మెయిన్ లీడ్ మధ్య లవ్ స్టోరీని ఇంకా కొత్తగా ఏమన్నా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ మిస్ మ్యాచ్డ్ వెబ్ సిరీస్ ను ఒక చిన్నగా మిస్ ఫైర్ అయ్యే టీనేజ్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. ప్లెసెంట్ గా సాగే కథనం నటీనటుల మంచి పెర్ఫామెన్స్ లు నిర్మాణ విలువలు ఆకట్టుకుంటాయి కానీ రొటీన్ స్టోరీని కొత్తగా ప్రెజెంట్ చెయ్యాలి అనే ప్రయత్నం విఫలం కావడం అక్కడక్కడా సాగదీతగా ఉండే కథనం జస్ట్ ఓకే అనిపిస్తాయి. ఓసారి చూడడానికి అయితే ఈ సిరీస్ ను లుక్కేయ్యొచ్చు.

Rating: 2.75/5

సంబంధిత సమాచారం :

More